హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికలు గులాబీ దళపతి కేసీఆర్ కు ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. తెలంగాణ శాసనసభను రద్దు చేసి ఎంతో ధైర్యంగా ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను నిలువరించే క్రమంలో చాలా ఆచితూచిగా వ్యవహరించారు. 

ప్రజాకూటమి రూపంలో నాలుగు పార్టీలు, బీజేపీ ముప్పేట దాడి చేస్తుండటంతో ఆ దాడిని తిప్పికొట్టేందుకు కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి ఉన్న సినీ గ్లామర్, జాతీయ నాయకులను నమ్ముకుంటే కేసీఆర్ మాత్రం తనే స్టార్ కాంపైనర్ గా వ్యవహరిస్తూ ఎన్నికల సమరంలో కదం తొక్కారు. 

కుటుంబ బలంతో జెట్ స్పీడుతో దూసుకుపోయారు. సాధారణంగా రాజకీయాల్లో కుటుంబ సభ్యులు పెరిగే కొద్దీ విభేదాలు ముదురుతాయి. చివరికి పార్టీ గెలుపు ఓటములను కూడా ఆవే శాసిస్తాయి. అందుకు ఉదాహరణే తమిళనాడులో డీఎంకే, ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీల విచ్ఛిన్నమే నిదర్శనం. 

అలాంటి విబేధాలు తన కుటుంబంలో రాకుండా కేసీఆర్ జాగ్రత్తపడ్డారు. కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉంటే రాజకీయాల్లో విజయతీరాలకు చేరడం తేలికనడానికి కేసీఆరే దిశానిర్దేశం చేశారు. కుటుంబ బలాన్నే బలంగా నమ్ముకున్న కేసీఆర్ అతడే ఒక సైన్యం అంటూ తన కుటుంబ సైన్యంతో ఎన్నికల కదనరంగంలోకి దూకారు. 

తన కుమారుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీశ్‌రావు, తనయ కవితలను అస్త్రాలుగా ఉపయోగించారు. దళపతి కేసీఆర్ ఆలోచనలకు ఈ ముగ్గరు నేతలు అండదండలు అందిస్తూ కేసీఆర్ కు వెన్నంటే నిలిచారు. కేసీఆర్ జిల్లాల వారీగా చుట్టేస్తుంటే మిగిలిన చోట్ల అన్నీతామై తోడ్పాటునందించారు. ఈ ముగ్గురు నేతలు మూడోకన్ను తెరిచినట్లు తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలను చుట్టేసి పార్టీని గెలుపు పథంలో నడిపించడంలో విజయవంతమయ్యారు.  

కొంగరకలాన్‌ ప్రగతి నివేదన సభ తర్వాత పార్టీ వ్యవహారాల్లో తలమునకలైన కేసీఆర్‌ కొంత ఆలస్యంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ రంగ ప్రవేశంతో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో హై వోల్టేజీ వచ్చినంత ఉత్సాహం వచ్చింది. 

టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దళపతి ప్రజాశీర్వాద సభల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. వాడివేడి ప్రసంగాలతో ప్రచారంలో దూకుడు పెంచారు కేసీఆర్. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైనా గొంతు పెంచితే ఆశీర్వాద సభలో వాటిని తిప్పికొట్టేవారు కేసీఆర్.  

కేసీఆర్ రోజుకు ఐదు నుంచి తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్నారు. తనతోపాటు మొత్తం 118 మంది అభ్యర్థుల కోసం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేశారు. చివరగా తన సొంత నియోజకవర్గమైన గజ్వేలు ప్రజాఆశీర్వాద సభతో ప్రచారాన్ని ముగించారు.

పదునైన విమర్శలతో ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టడం కేసీఆర్‌కు వెన్నుతోపెట్టిన విద్య. ఆత్మీయమైన తెలంగాణ భాషలో సాగిన ఆయన ప్రసంగాలు ప్రజలను కట్టిపడేశాయి. మాటల మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్‌ మరోసారి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థుల అంచనాలను తారుమారు చేసేలా వ్యూహరచన చేశారు. 

మరోవైపు తండ్రికి తగ్గ తనయుడుగా ఈఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పేరు తెచ్చుకున్నారు. వాగ్ధాటిలో తండ్రికి తగ్గతనయుడిగా ప్రతిపక్ష పార్టీలను ఇరుకునపెట్టేలా పంచ్ లు పేలుస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోయారు. 

కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తే కేటీఆర్ అత్యధికంగా 70 స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న కేటీఆర్ రోడ్ షోలతో హోరెత్తించారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించిన అనుభవంతో కేటీఆర్ దూసుకుపోయారు. ఒక దశలో సెటిలర్లపై కేసీఆర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నష్టనివారణ చర్యలను కేటీఆరే స్వయంగా చేపట్టారు. సెటిలర్లకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. నగరంలో, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రెబల్స్‌, అసమ్మతులను బుజ్జగించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారు. 

కేసీఆర్‌ మంత్రి వర్గంలో కీలకమైన ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్ కేటీఆర్ అనేక సమ్మిట్ లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ యువనేతగా కేటీఆర్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. 

ఇది కేసీఆర్‌, టీఆర్ఎస్ కు అదనపు బలంగా మారింది. ఇకపోతే హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌ తర్వాత కొత్త తరం రాజకీయనాయకుడిగా కేటీఆర్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 ఇకపోతే ట్రబుల్ షూటర్ గా పేర్గాంచిన హరీష్ రావు ఈ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. సామాన్యుడు సైతం అభిమానించే నేతగా హరీష్ కు మాంచి ఇమేజ్ ఉంది. మేనమామ కేసీఆర్‌ మాటంటే హరీశ్‌కు వేదవాక్కు. కార్యదక్షుడిగా, ట్రబుల్‌ షూటర్‌గా హరీశ్‌కు మంచి పేరుంది. 

అందుకే హరీష్ రావు ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌ కీలక బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. హరీశ్‌ ప్రతి సందర్భంలో కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. తెలంగాణ మొత్తానికి సిద్దిపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో హరీశ్‌ ఇమేజ్‌ బాగా పెరిగింది. 

హరీష్ రావు లాంటి నాయకుడు తమకు ఉండాలంటూ అనేక ప్రాంతాల ప్రజలు భావిస్తారంటే అతిశయోక్తి కాదు. టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ సాగునీటి ప్రాజెక్టులను హరీష్ రావు స్వయంగా పర్యవేక్షించారు. 

గులాబీ దళపతిగా తెలంగాణ వ్యాప్తంగా మేనమామ సుడిగాలి పర్యటనలు చేస్తుంటే ఆయన నియోజకవర్గ బాధ్యతలను హరీష్ రావు తన భుజస్కందాలపై వేసుకున్నారు. దీంతో తన నియోజకవర్గం సిద్ధిపేటతోపాటు పాటు మరో 25 నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. రెబల్స్‌ను బుజ్గగించడం వంటి బాధ్యతలను కూడా పంచుకొన్నారు. 

ఇకపోతే ఎన్నికల సమయంలో కేసీఆర్ కుటుంబంలో ఆదిపత్య పోరు నడుస్తోందంటూ విభజించే ప్రయత్నాలు చేశారు. కానీ అలాంటి ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా గెలుపుకోసం అహర్నిశలు శ్రమించారు కేసీఆర్ అండ్ కో. 

వంటేరు ప్రతాపరెడ్డి వంటి నాయకులు హరీశ్‌ విశ్వసనీయతపై చేసిన ఆరోపణలను సైతం కేసీఆర్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది హరీశ్‌రావుపై కేసీఆర్‌కు నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అంతేకాదు తమకు కేసీఆర్‌ నాయకుడని ఆయన నాయకత్వంలో పనిచేస్తామని మరో ఆలోచనే లేదని హరీష్, కేటీఆర్ లు ఎక్కడికక్కడ తిప్పికొట్టేవారు. తాము కలిసే ఉన్నామని పార్టీ శ్రేణులకు బలమైన సందేశాన్ని పలుమార్లు పంపించారు. 

పలుమార్లు వేదికలపై బావబావమరుదులు ఏకమై తాము ఐక్యంగా ఉన్నామంటూ ప్రకటించేవారు. ఇలాంటి సంకేతాలు టీఆర్ఎస్ శ్రేణులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు ఉపయోగపడింది. 
 
మరోవైపు తెలంగాణ ఆడపడుచుగా ప్రజలకు సుపరిచితురాలైన కవిత సైతం తనదైన శైలిలో తండ్రికి ప్రోత్సాహం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే బతుకమ్మ ఉత్సవాలు వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను ఆమె చూసుకొన్నారు. ముందస్తు ఎన్నికల్లో కవిత దాదాపు 13 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. 

నిజామాబాద్ జిల్లాలో అంతా తానై పార్టీని ఏకతాటిపైకి నడిపించడంలో విజయవంతమయ్యారు. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని ఓడిస్తానని పంతంపట్టి మరీ ఓడించింది కవిత. మెుత్తానికి ఇతర పార్టీలు స్టార్ లను నమ్ముకుంటే కేసీఆర్ మాత్రం తన కుటుంబాన్నే నమ్ముకున్నారు. ఫలితం సాధించారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారం, వ్యూహం, బలం, బలహీనతలపైనే దేశమంతా జోరుగా చర్చిస్తోంది.