హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహం ఫలించింది. కాంగ్రెసు దిగ్గజాలను గురి పెట్టి ఆయన ఎన్నికల వ్యూహరచన చేశారు. 

కాంగ్రెసు సీనియర్ నాయకులపై బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి, ఆయా నియోజకవర్గాల్లో పక్కాగా పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు నియోజకవర్గాల నుంచి కదలలేని పరిస్థితి ఏర్పడింది. 

రాష్ట్ర స్థాయి నాయకులుగా ముందుకు వచ్చిన కె. జానారెడ్డి, డికె అరుణ, దామోదర రాజనర్సింహ, రేవంత్ రెడ్డి వంటి పలువురు సీనియర్ నేతలను ఆయన లక్ష్యంగా చేసుకుని వ్యూహరచన చేశారు. రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని పోటీకి దించి అక్కడి గెలుపు బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలను మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు అప్పగించారు. అలాగే, జగిత్యాల వంటి కీలకమైన నియోజకవర్గం బాధ్యతలను తన కూతురు, ఎంపీ కల్వకుంట్ల కవితకు అప్పగించారు. 

దానికితోడు, అన్ని నియోజకవర్గాల్లోనూ సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సదస్సులు నిర్వహించి, ఏయే సామాజిక వర్గానికి ఏం చేశామనే విషయాన్ని వివరిస్తూ కీలకమైన టీఆర్ఎస్ నేతలు ముందుకు సాగారు. 

అదే సమయంలో సంక్షేమ పథకాల లబ్దిదారులను లక్ష్యంగా చేసుకుని వారి చేత తొలుత ఓటు వేయించాలనే వ్యూహం బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు పార్టీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ప్రచారం కూడా టీఆర్ఎస్ కు కలిసి వచ్చిందనే చెప్పాలి.