Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్:కేసీఆర్

రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాను టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చెయ్యబోతుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

kcr says trs won 13 seats in karimnagar district
Author
Karimnagar, First Published Nov 26, 2018, 4:59 PM IST

కరీంనగర్:రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాను టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చెయ్యబోతుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచి ఒక స్థానంలో ఓటమి పాలయ్యామని అయితే ఈసారి 13 స్థానాలు గెలుస్తున్నామన్నారు. 

తనకు వచ్చిన సర్వేలో తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందని తెలిపారు. బంపర్ మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ కు రాష్ట్రవ్యాప్తంగా అనుకూల పవనాలు వీస్తున్నట్లు తెలిపారు. తాను రాష్ట్రం అంతా తిరుగుతున్నానని ఎక్కడ చూసినా సానుకూల వాతావరణం ఉందన్నారు. 

ఇకపోతే తెలంగాణ ఆదాయం గత నాలుగు సంవత్సరాలుగా చూస్తే గణనీయంగా పెరుగుతుందన్నారు. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది 17.7 శాతం ఆదాయం సాధిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 19.83 శాతం ఆర్థిక వృద్ధి రేటు ఉందన్నారు. 

సంపద పెంచాం ప్రజలకు పంచామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుకమీద పదేళ్లకు 9కోట్లు 50 లక్షల రూపాయలు ఆదాయం వస్తే....టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో 2వేల కోట్లుకు పైగా నిధులు సాధించామన్నారు. 

తెలంగాణలో అవినీతిని తగ్గించామని, రౌడీ యిజాన్ని నిర్మూలించామని తెలిపారు. గత పాలకులు ఏ రంగాన్ని పట్టించుకోలేదన్నారు. చేనేత కార్మికులను కానీ, బీడీ కార్మికులను కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించగలిగామన్నారు. 

మరోవైపు వలస పాలకులను మోసుకువస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటుతో చావు దెబ్బ కొట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టనివ్వొద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబును మోసుకువస్తున్న కాంగ్రెస్ ను ఓడించి పంపించాలని కోరారు.   

 

ఈ వార్తలు కూడా చదవండి

టీఆర్ఎస్, ప్రజాకూటమిల మధ్య పోటీ, మిగిలిన పార్టీలు లెక్కలో లేవ్:కేసీఆర్

 

Follow Us:
Download App:
  • android
  • ios