తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సిద్దమైంది. రేపు(గురువారం) ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతుంది. దీంతో ఆపద్దర్మ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మంత్రి మండలి సభ్యులు కూడా రాజీనామా చేశారు. 

కేసీఆర్ తన రాజీనామాను కార్యదర్శి చేత రాజ్ భవన్ కు పంపించారు. అది అందిన వెంటనే ఆమోదించిన  నరసింహన్ దీంతో పాటే 18 మంది మంత్రుల రాజీనామాలపై ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి ఉత్తర్వులు జారీ చేశారు.  

ముందస్తు ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి మండలి రెండు నెలల క్రితమే రాజీనామా చేశారు. దీంతో మంత్రి మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న గవర్నర్ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ ను, మంత్రులను కోరారు. దీంతో అప్పటి నుండి కేసీఆర్ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 199 స్థానాలకు గాను 88 స్థానాలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ ను మళ్లీ తమ శాసనసభాపక్ష నేత ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ను కూడా కొందరు ఎమ్మెల్యేలు కలిశారు. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైన కేసీఆర్ ఆపద్దర్మ సిఎం పదవికి రాజీనామా చేశారు.