రామోజీ రావు అరెస్ట్ కు జగన్ అంతా సిద్దంచేసారు... కేసీఆర్ కుదరనివ్వలేదు..: కేటీఆర్ సంచలనం
మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి చెందారు. అయితే జీవిత చరమాంకంలో ఆయన కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ పై ప్రచారం జరిగినా అలా జరగలేదు. ఈ విషయంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : మీడియా మొగల్, వ్యాపార దిగ్గజం రామోజీరావు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ కు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఇక రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.
అయితే రామోజీ రావు జీవితంలో గత ఐదేళ్ళు చాలా కఠినంగా గడిచాయనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు ఆయనకు సన్నిహితులను టార్గెట్ చేసారు. ఈ క్రమంలోనే ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకూ ఇబ్బందులు తప్పలేవు. చివరకు మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్ లో నివాసముండే ఆయనను అరెస్ట్ చేయాలన్న వైఎస్ జగన్ ప్రయత్నాలను ఆనాటి సీఎం కేసీఆర్ సాగనివ్వలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
రామోజీరావు అరెస్ట్ వ్యవహారంపై కేటీఆర్ కామెంట్స్ :
చిన్న స్థాయినుండి అంచలంచలుగా ఎదిగి మీడియా రంగంలోనే కాదు అనేక వ్యాపారాల్లోనూ టాప్ లో నిలిచారు రామోజీరావు. మీడియా మొగల్ గానే కాదు వ్యాపారం దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జీవిత చరమాంకంలో అరెస్ట్ చేయడానికి వైఎస్ జగన్ సర్కార్ విశ్వప్రయత్నం చేసింది. ఇందుకోసం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సహకారం కూడా కోరారట. కానీ అందుకు అంగీకరించని కేసీఆర్ చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారట. ఈ విషయాన్ని గతంలో ఏబిఎన్ రాధాకృష్ణ 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' పోగ్రాంలో మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
రామోజీరావును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కేసీఆర్ వ్యతిరేకించారని... చట్టప్రకారం నడుచుకోవాలని కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు. పెద్దాయనకు 87 ఏళ్లు... క్యాన్సర్ తో బాధపడుతున్నారు... ఆయనపై ఇదంతా ఏంటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసారట. ఇలా ఆయన అరెస్ట్ ను కేసీఆర్ అడ్డుకున్నారు... ఈ విషయాన్ని తాను రామోజీ రావు కొడుకుకు కూడా చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారు.
అసలు ఏమిటీ మార్గదర్శి కేసు :
మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీ రావు జీవితాన్నే మలుపుతిప్పిన సంస్థ. ఇదే ఆయన ప్రారంభించిన మొదటి వ్యాపారం... హైదరాబాద్ లో 1962 లో ప్రారంభమైన ఈ చిట్ ఫండ్స్ ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించింది. 2019 వరకు మార్గదర్శి వ్యాపారం సాఫీగానే సాగింది... కానీ వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చిక్కులు మొదలయ్యాయి.
మార్గదర్శి చిట్ పండ్స్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు వెళ్ళారు. దీంతో జగన్ సర్కార్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుంది... మార్గదర్శిలో జరిగిన అవకతవకలపై విచారణకు సిఐడిని రంగంలోకి దింపింది. చట్టవిరుద్దంగా ఈ చిట్ ఫండ్ వ్యాపారం జరుగుతోందంటూ రామోజీరావుతో పాటు ఆయన కోడలు శైలజా కిరణ్ పై కేసులు పెట్టారు. దీంతో ఏపీలోని మార్గదర్శి కార్యాలయాలపై దాడులు చేసింది సిఐడి. ఆర్బిఐ నిబంధనలకు విరుద్దంగా లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు.
ఈ క్రమంలోనే మార్గదర్శిలో జరిగిన అవకతవకలపై రామోజీరావు, శైలజా కిరణ్ లను ఇటీవల సిఐడి విచారించింది. అయితే వారిని అరెస్ట్ కూడా చేయవచ్చనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే ఈ అరెస్ట్ ను కేసీఆర్ వ్యతిరేకించారని ... తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరించిందని కేటీఆర్ వెల్లడించారు.