హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చీఫ్ కొన్ని స్థానాల్లో  అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో  ఉంది. రెండు స్థానాల్లోనే అభ్యర్థులను మారుస్తారా.. మిగిలిన స్థానాల్లో కూడ అభ్యర్థులను మారుస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.మరోవైపు కేసీఆర్ కూడ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది.

ఈ నెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో   టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా  మార్చి మాసంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే రెండు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం  జోరుగా సాగుతోంది. మహబూబ్‌నగర్, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో  టీఆర్ఎస్ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని   ప్రచారం సాగుతోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో  ఏపీ జితేందర్ రెడ్డి స్థానంలో మరోకరిని బరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  గత ఎన్నికల్లో  పొంగులేటి శ్రీనివాస్  రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాల్లో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. అయితే ఈ దఫా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కుతోందా లేదా అనే చర్చ సాగుతోంది.

కరీంనగర్  లేదా నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి కేసీఆర్ ఈ దఫా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో  కేసీఆర్ ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. మాజీ మంత్రి టీఆర్ఎస్‌లో చేరితే  మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి  పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరినందున  ఈ దఫా ఈ స్థానం నుండి తాండూరు నుండి ఓటమి పాలైన  మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఎంపీగా  బరిలోకి దిగే అవకాశం ఉంది. పెద్దపల్లి నుండి వివేక్ బరిలోకి దింపే ఛాన్స్ ఉంది.

కరీంనగర్ నుండి  కేసీఆర్ బరిలోకి దిగితే ప్రస్తుత ఎంపీ వినోద్ కుమార్‌కు ఎక్కడి నుండి  పోటీ చేస్తారనే విషయమై పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నల్గొండ నుండి  కేసీఆర్ బరిలోకి దిగితే సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందంటున్నారు. 

గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి మైనంపల్లి హన్మంత్ రావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లారెడ్డి విజయం సాధించారు. తర్వాతి పరిణామాల్లో  మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల ఎన్నికల్లో మేడ్చల్ నుండి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 

మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావు ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.దీంతో ఈ స్థానంలో టిక్కెట్టు ఎవరికి దక్కుతోందోననే చర్చ పార్టీ వర్గాల్లో  చర్చ సాగుతోంది. నిజామాబాద్ నుండి మరోసారి కవిత బరిలోకి దిగనుంది.   ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థుల మార్పులు చేర్పులపై  జనవరి మాసంలో  స్పష్టత వచ్చే అవకాశం ఉంది.