కల్వకుర్తి :  కాంగ్రెసు సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి పెద్ద మనిషి అని, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారని, ఆయనకు తెలివి ఉందో లేదో తెలియదు గానీ మిషన్ భగీరథ కింద నీళ్లు రాలేదని అంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. కల్వకుర్తి ఆశీర్వాద సభలో ఆయన మంగళవారం ప్రసంగించారు. 

మిషన్ భగీరథ కింద నీళ్లు వచ్చాయా లేదా అనేది ప్రజలకు తెలుసునని, జైపాల్ రెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడటం దారుణం ఆయన అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ పటం మీద పెట్టానని చంద్రబాబు అంటున్నారు, కరెంట్ కష్టాలు ఎందుకు తీర్చలేకపోయారని ఆయన అన్నారు.   70 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో కల్వకుర్తి నియోజకవర్గానికి కన్నీళ్లే మిగిలినయి తప్ప ఈ నియోజకవర్గం తలరాత మార్చలేదని ఆయన అన్నారు. 

ఎన్నికల్లో పార్టీలు, వ్యక్తులు గెలవడం ముఖ్యం కాదని, ప్రజలు గెలవాలని అన్నారు.గత పాలకులు కల్వకుర్తి తలరాత మార్చేందుకు ప్రయత్నించలేదని అన్నారు. మహబూబ్ నగర్ ను చంద్రబాబు దత్తత తీసుకున్నా కూడా 9 చుక్కల నీరు కూడా రాలేదని, ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేశారని ఆయన అన్నారు. 

 మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు రానివ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని, పాలమూరు ఎత్తిపోతలను కడుతున్నామని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల కట్టొద్దని చంద్రబాబు కేసులు వేశారని, కాంగ్రెస్ నాయకులు కూడా కేసులు వేశారని ఆయన అన్నారు. ఆంధ్రా నేతల వద్దకు మనం పోవాలా? చంద్రబాబు నాయుడు పెత్తనం మనకు అవసరమా అని ఆయన అడిగారు.