హైదరాబాద్: కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేనని చెప్పుకొచ్చారు. 

గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అనే పథకాన్ని రూపొందించి అమలు చేసిందని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని హర్ ఘర్ జల్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

మెున్న రైతు బంధు, నేడు మిషన్ భగీరథ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆదర్శంగా కేంద్రం పథకాలు ప్రవేశపెడుతుందని అభిప్రాయపడ్డారు. దేశానికే తెలంగాణ సీఎం కేసీఆర్ దిక్సూచీ అంటూ  అభిప్రాయపడ్డారు.