హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావు రాజకీయ భవిష్యత్తుపై ఆయన అనుచరుల్లో రోజు రోజుకూ ఆందోళన పెరుగుతోంది. మిషన్ భగీరథపై జరిపిన సమీక్షా సమావేశానికి కేసీఆర్ హరీష్ రావును ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆ సమావేశంలో హరీష్ రావు పాల్గొనలేదు. 

అంతకు ముందు నీటి పారుదల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా హరీష్ రావు లేరు. గత మంత్రివర్గంలో హరీష్ రావు నీటి పారుదల ప్రాజెక్టులను నిర్వహించారు. దానికి తోడు, ఆయన ఓఎస్డీ శ్రీధర రావు దేశ్ పాండే ఇప్పటికే తన మాతృ సంస్థకు వెళ్లిపోయారు. 

కేసీఆర్ మంగళవారంనాడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాల్సి ఉండింది. అయితే,త వాతావరణం సరిగా లేకపోవడంతో ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కూడా కేసీఆర్ హరీష్ రావును ఆహ్వానించలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి హరీష్ రావుకు ఆ శాఖను ఇస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

హరీష్ రావు మాత్రం తన అంతరంగాన్ని వెల్లడించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేసీఆర్ తనయుడు, తన బావమరిది కేటీ రామారావును మాత్రం ఆయన అభినందించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి కూడా హాజరయ్యారు.