తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు సాయం చేసిన దివ్యాంగుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాల్లోకి వెళితే... భద్రాద్రి జిల్లాకు చెందిన నూకసాని శ్రీనివాసరావు కేసీఆర్‌కు వీరాభిమాని. అంగవైకల్యంతో బాధపడుతూ భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో ఎన్నికల సమయంలో చంద్రశేఖర్ రావు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని.. రూ. 1000 పెన్షన్ ఇస్తే సరిపోతుందంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీనిని చూసిన సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు అతనికి తక్షణ వైద్య సహాయం అందించాలని భావించాడు.

ఇందుకు గాను భద్రాచలానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. వైద్యులు చికిత్స అందిస్తూనే... మరింత మెరుగైన వైద్య సాయం కోసం హైదరాబాద్‌ తరలించేందుకు ప్రయత్నిస్తుండగా... శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించడంతో అతను మృతి చెందాడు.

ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హిమాన్షు వయసులో చిన్నవాడైనా.. దివ్యాంగుడికి సాయం చేసి అందరి మన్ననలు పొందారు. కానీ చివరికి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.