రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు గాను గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది తెలంగాణ సర్కార్ ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: రాష్ట్రంలో Paddy ధాన్యం కొనుగోలు చేయాలని Telangana ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ధాన్యం కొనుగోలు కోసం రెండు మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. కొన్ని చోట్ల గతంలోని కొనుగోలు కేంద్రాలను తిరిగి తెరిచారు.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న నిర్వహించిన Cabinet సమావేశంలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

 రాష్ట్రంలోని 36 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండించినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరి కోతలు సాగుతున్నాయి. దీంతోపెద్ద ఎత్తున మార్కెట్లోకి వరి ధాన్యం వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరి ధాన్యం కొనుగోలు కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 

ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై ఆయా జిల్లాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. ఏ జిల్లాల్లో ఏ మేరకు వరి ఉత్పత్తి అవుతుందనే విషయం ఆధారంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 

సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 1940 చెల్లించనున్నారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 1960 చెల్లించనున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై సుమారు రూ. 5 వేల కోట్లు అదనంగా భారం పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 

రాష్ట్రంలో యాసంగి సీజన్ లో నూకలు ఎక్కువగా అవుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో నూకలు ఎక్కువగా అవుతాయి. సాధారణంగా క్వింటాలు వరి ధాన్యం మిల్లింగ్ చేస్తే 50 కిలోల బియ్యం 17 కిలోల నూకలు వస్తాయి. అదే యాసంగిలో అయితే క్వింటాల్ వరిని మిల్లింగ్ చేస్తే 17 కిలోల నూకలకు మరో 17 కిలోలు తోడౌతాయి. అంటే బియ్యం 36 కిలోలు మాత్రమే వస్తాయి.
బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. నూకలను ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రతి క్వింటాల్ పై ప్రభుత్వానికి రూ.400 నుండి రూ.500 భారం పడే అవకాశం ఉందని సమాచారం.

వరి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందున రైతులు ఎవరూ కూడా తక్కువ ధరకు తమ ధాన్యాన్ని విక్రయించవద్దని రైతులను KCR కోరారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో కంద్రం అనుసరించిన వైఖరిని కేసీఆర్ తప్పుబట్టారు. 

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం సాగుతుంది. రెండు పార్టీలు తమ తమ వాదనలను సమర్ధించుకుంటున్నాయి. బాయిల్డ్ రైస్ ను ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిచ్చిన లేఖ గురించి బీజేపీ ప్రస్తావిస్తుంది. ఈ లేఖ రాసిచ్చిన తర్వాత మరోసారి బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడాన్ని బీజేపీ నేతలు తప్పు బడుతున్నారు. 

వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని బీజేపీ, టీఆర్ఎస్ లు తమ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు వాడుకొంటున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. ఈ రెండుపార్టీలుర సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపకపోగా సమస్యను మరింత జఠిలం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది.