తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బాజీరెడ్డి గోవర్థన్ పరిణితి చెందిన రాజకీయ నేతని ఆయన్ను లక్ష మెజారిటీ గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

డిచ్‌పల్లి నియోజకవర్గంలో అన్ని వున్నాయని... అయితే సాగునీరు మాత్రం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతుల కాళ్లు కడుగుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

లక్షా పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, జక్రాన్‌పల్లిలో ఎయిర్‌డ్రమ్‌ తీసుకొస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు తీసుకొస్తానని సీఎం తెలిపారు.

ముస్లింలకు రిజర్వేషన్లు రానివ్వనని అమిత్ షా చెబుతున్నారని... ఎందుకు రాదో తాను చూస్తానన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్ గెలుస్తారని.. టీఆర్ఎస్‌కు 15 ఎంపీలను అందిస్తే ఇద్దరం కలిసి కేంద్రంతో పోరాడి ముస్లిం రిజర్వేషన్లు తీసుకొస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.