వనపర్తి సభలో చెప్పినట్టుగానే నేడు నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మొత్తం  80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 

ఇక, కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాల ద్వారా ఏటా 7వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను ముందే గుర్తించి.. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. పారదర్శకంగా ఉద్యోగుల భర్తీ చేపడతామని వెల్లడించారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమన్నారు. Hyderabad తొలుత ఒక దేశంగా, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఉందన్నారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో తాను 9వ తరగతి విద్యార్ధిగా పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నానని కేసీఆర్ చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్ధిగా మీరు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష, అన్యాయాలతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. 

వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్ అని చెప్పారు. కానీ రాజకీయాలంటే తమకు ఓ టాస్క్ అని కేసీఆర్ చెప్పారు. వ్యక్తిగతంగా కూడా తనను కూడా నిందించారన్నారు. అయితే చిల్లర గాళ్లని అని వదిలేశానని చెప్పారు. 

నీళ్లు, నిధులు, నియమాకాలే తమ ఉద్యమ ఎజెండా అని కేసీఆర్ గుర్తు చేశారు. నీళ్లు కూడా తెచ్చుకొన్నామన్నారు. ఇంకా కూడా తెలంగాణ వాటా సాధించుకొనే వరకు పోరాటం చేస్తామన్నారు. గోదావరి జలాలను ఇప్పటికే సాధించుకొన్నామని చెప్పారు. నీటిో వాటాల కోసం పోరాటం చేస్తామన్నారు.