రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్‌లో ప్రచారం చేస్తున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్‌లో ప్రచారం చేస్తున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువతో సత్కరించారు. కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీగా యశ్వంత్ సిన్హా.. జలవిహార్‌కు బయలుదేరారు.
ముందు బైక్ ర్యాలీగా వేలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగారు. ఆ వెనకాల సీఎం కేసీఆర్, ఇతర నాయకులు కాన్వాయ్ కూడా ఉంది. సీఎం కేసీఆర్, యశ్వంత్ సిన్హా ఒకే వాహనంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జలవిహార్‌కు పయనమయ్యారు. బేగంపేట, రాజ్‌భవన్, ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు టీఆర్ఎస్ భారీ ర్యాలీ సాగుతుంది. ఆ మార్గంలో రోడ్లన్నీ గులాబీమయ్యాయి. ఎటూ చూసిన ఫ్లెక్సీలు, కటౌట్‌లు, పార్టీ జెండాలు, టీఆర్ఎస్ నేతల సందడే కనిపిస్తుంది.
జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిచనున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుపై పార్టీ శాసనసభ్యులు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత తనకు మద్దతివ్వాలని కోరుతూ యశ్వంత్ సిన్హా ప్రసంగించనున్నారు. అక్కడ సభ ముగిసిన తర్వాత కేసీఆర్, టీఆర్ఎస్ నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు.
టీఆర్ఎస్ సమావేశం అనంతరం యశ్వంత్ సిన్హా ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యశ్వంత్ సిన్హా బెంగళూరు వెళ్లనున్నారు.
