నాగర్‌ కర్నూలు: టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అసమ్మతిని నివారించేందుకు ఆ పార్టీనేతలు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు అలకపాన్పు ఎక్కితే మరికొందరు ఇతర పార్టీలోకి జంప్ అయ్యారు. రెండో జాబితా వచ్చేసరికి మరింతమంది టీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారని లేని పక్షంలో ఇండిపెండెంట్ గా భరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసమ్మతిని నివారించడంతోపాటు జంప్ జిలానీలను కట్టడి చెయ్యాలని టీఆర్ఎస్ భావిస్తోంది. గోడదూకిన నేతలను వదిలేసి అలకబూనిన నేతలను టార్గెట్ గా పెట్టుకుంది. పలు రకాల తాయిళాలు ప్రకటించి అలకపాన్పు నుంచి దించుతోంది.తాజాగా కల్వకుర్తి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అలకబూనారు. 

వాస్తవానికి టీఆర్‌ఎస్‌ చీఫ్ కేసీఆర్ అభ్యర్థుల మెుదటి జాబితా ప్రకటించిన తర్వాతే పార్టీలో అసమ్మతి చెలరేగింది. అసమ్మతిరాగం అందుకున్న కొందరు నేతలను టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించినా కొందరు మాత్రం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే కల్వకుర్తి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అలకపాన్పు ఎక్కారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

అంతేకాదు కసిరెడ్డి నారాయణరెడ్డి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నారాయణరెడ్డితో చర్చించారు. బుజ్జగించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే కల్వకుర్తిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌ యాదవ్‌కు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని భావించిన కేటీఆర్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. 

దీంతో గురువారం కేటీఆర్ మరోసారి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో భేటీ అయ్యారు. భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ హామీతో అలకవీడిన నారాయణరెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌ యాదవ్‌ను గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి కల్వకుర్తిలో జరిగే టీఆర్‌ఎస్‌ బహిరంగసభకు హాజరయ్యారు. కసిరెడ్డి అలకవీడటంతో ఆపార్టీలో జోష్ నింపుకుంది.