జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. పోలీసుల అదుపులో కడప విద్యార్ధి, కదులుతోన్న డొంక
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు.
ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్ల భర్తీకి ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ విద్యార్ధిని అరెస్ట్ చేశారు. ఇతను తాను రాసిన జవాబులను వాట్సాప్ ద్వారా మిత్రులకు పంపాడు. అలా నలుగురికి జవాబులు పంపినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా వివిధ సెంటర్లలో పరీక్షలు రాస్తున్నవారే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఆన్‌లైన్ ద్వారా జరిగాయి. ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణల నుంచి దాదాపు 35 వేల మంది హాజరయ్యారు. ఈసారి కటాఫ్ మార్కులు సుమారు 60గా వుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. మాస్ కాపీయింగ్ విషయం బయటపడటంతో కడపకు చెందిన విద్యార్ధిని అరెస్ట్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అతని వద్ద ఫోన్ దొరికింది. అయితే పరీక్షా కేంద్రంలోకి ఫోన్ ఎలా వచ్చింది.. నిందితుడికి ఎవరైనా సహకరించారా అన్నకోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.