హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై సీనియర్ కాంగ్రెసు పార్టీ నేత కుందూరు జానారెడ్డి మెలిక పెట్టారు. నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికను సాకుగా చూపి పీసీసీ చీఫ్ నియామకాన్ని వాయిదా వేయాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేయాలని కోరారు. 

ఆ మేరకు జానారెడ్డి తెలంగాణ ఇంచార్జీ కార్యదర్శి ఎస్ఎస్ బోస్ రాజుకు, అధిష్టానం పెద్దలకు ఫోన్ చేశారు ఉప ఎన్నికకు ముందు పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించిన ప్రకటన చేస్తే ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, పార్టీ నేతల్లో విభేదాలు పొడసూపి దాని ప్రభావం ఉప ఎన్నికపై పడుతుందని ఆయన అన్నారు. 

పీసీసీ ఎంపికపై తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ అభిప్రాయ సేకరణ జరిపారు. ఆ అభిప్రాయ సేకరణ మేరకు పీసీసీ చీఫ్ వదపికి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పేర్లను పరిశీలించారు చివరకు రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా రేవంత్ రెడ్డి పేరు వెనక్కి వెళ్లి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ముందుకు వచ్చింది. 

పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డిని పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్ నేతలు ఇష్టపడడం లేదని, పైగా ఆయన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. సీనియర్ నేత వి. హనుమంతరావు బహిరంగంగానే వ్యతిరేకించారు. పైగా రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు