సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం చేసే జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని టీయూఓడబ్లూజే ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను విడుదల చేయాలని టీయూఓడబ్లూజే ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి ఆయన ఒక లేఖ రాశారు. సోషల్ మీడియాలో వార్తలు ప్రచురితం చేసే జర్నలిస్టులపైన వరుసగా దాడులు, అరెస్టులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా దాదాపు 50 మంది జర్నలిస్టులను అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం అందిందని చెప్పారు. అందులో కొందరిపై భౌతికదాడి కూడా జరిగినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు ఏ పోలీసు స్టేషన్‌లో ఉన్నారనే విషయం కూడా సమాచారం తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మనది ప్రజాస్వామ్య దేశమని, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ పౌరుడికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు దీనిని మీడియా స్వేచ్ఛ పేరుతో కొంత మంది దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమే అని అన్నారు. అయితే అందులో ప్రధానంగా సోషల్ మీడియాలో దుర్వినియోగం జరుగుతోందని అన్నారు. కొందరు యువకులు తెలిసీ తెలియక, అవగాహన లోపంతో వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు తంబ్ నెయిల్స్ పెట్టడం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఇది జర్నలిస్టులు చేస్తున్న తప్పు కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మీడియాలోని పత్రికలు, టీవీ ఛానెళ్లు క్రమశిక్షణ, సంయమనం పాటిస్తాయని తెలిపారు. అయితే ఈ క్రమశిక్షణ, సంయమనం కొంత వరకు సోషల్ మీడియా పాటించడం లేదని, దీనిని అంగీకరిస్తున్నామని అన్నారు. అయితే చిన్న తప్పులకు పెద్ద శిక్ష సరైంది కాదని, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేయకూడదని తెలిపారు. తప్పులు జరిగినప్పుడు ఒక సారి హెచ్చరించాలని, లీగల్ గా నోటీసులు ఇవ్వాలని కోరారు. అప్పటికీ తీరు మార్చుకోని వ్యక్తులపై కేసులు పెట్టాలని సూచించారు. అంతేగాని వారిని కొట్టడం సరైంది కాదని చెప్పారు. దయచేసి భౌతికదాడులకు పాల్పడవద్దని కోరారు. అమాయకులైన జర్నలిస్టుల మీద దాడులు సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కోరారు.
