నిరుద్యోగుల జీవితాలకు, సోనియా గాంధీ భర్త్ డేకు లింకు.. రేవంత్ భారీగానే ప్లాన్ చేసారుగా ...
తెలంగాణలో ప్రస్తుతం ఆందోళనబాట పట్టిన నిరుద్యోగులకు దారిలోకి తెచ్చుకునేందకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజును... నిరుద్యోగుల జీవితాలకు లింక్ చేసేలా గట్టిగానే ప్లాన్ చేసారు.
Revanth Reddy : నిరుద్యోగుల ఆందోళనల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఇకపై ప్రతి ఏటా ఉద్యోగ నియామకాలు వుంటాయని... ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇవాళ(శనివారం) హైదరాబాద్ ప్రజాభవన్ లో "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న యువతకు ఆర్థికంగా చేయూత ఇచ్చే కార్యక్రమమే ఈ అభయహస్తం. యూపిఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించి మెయిన్స్ కోసం సన్నద్దమయ్యే విద్యార్థులకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. తమ సివిల్స్ కలను నిజం చేసుకునే క్రమంలో ఆర్థిక కష్టాలు అవరోదంగా మారకుండా వుండాలనే ఈ పథకం ద్వారా సాయం చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తెలంగాణ పోరాటం జరిగిందే నియామకాల కోసమని అన్నారు. ఎందరో అమరుల త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడిందన్నారు. కాబట్టి ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యతగా వుండాలి. కానీ గత పదేళ్లు ఉద్యమ ఆకాంక్షలకు విరుద్దంగ పాలన సాగింది... ముఖ్యంగా నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగుల పక్షాన నిలిచి భారీ ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్ తెలిపారు. కేవలం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసామని... ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామన్నారు. ఇంతటితో ఆగకుండా మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టినట్లు రేవంత్ తెలిపారు.
ఇప్పటికే గ్రూప్స్ ప్రిలిమినరీ ప్రరీక్షలు నిర్వహించామని.... ఉపాధ్యాయులు నియామకాల కోసం డిఎస్సి పరీక్షలు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. నిరుద్యోగుల ఇబ్బందులకు గుర్తించి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. పకడ్బందీ ప్రణాళికలతో ఉద్యోగ నియామక పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
యూనియన్ పబ్లిక్ సర్విస్ కమీషన్ (యూపీఎస్సీ) తరహాలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్సీ)ని తీర్చిదిద్దుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం టీజిపిఎస్సి లో మార్పులు చేసినట్లు తెలిపారు. ఇకపైఎప్పుడుపడితే అప్పుడు నియామకాలు వుండవని... ప్రణాళికాబద్దంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఇకపై ప్రతి ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని... జూన్ 2న ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. డిసెంబర్ 9 లోగా నియామక ప్రక్రియను ముగించి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తామన్నారు.ఇలా ప్రతి ఏడాది ముందుగానే ఖాళీలను ప్రకటించి నియామకాలు చేపట్టేలా జాబ్ క్యాలెండర్ వుంటుంది... ఇది నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగకరంగా వుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ప్రజా భవన్ లో జరిగిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
- Anumula Revanth Reddy
- CM Revanth Reddy
- Employment schemes Telangana
- Government job notifications
- Rajiv Gandhi Civils Abhayahastham scheme
- Sonia Gandhi birthday
- TGPSC
- Telangana CM
- Telangana Job Calendar
- Telangana Public Service Commission
- Telangana employment news
- Telangana job announcement
- Telangana job recruitment
- UPSC