లక్షకి రూ.3 లక్షలు లాభం .. మాయమాటలకు చిక్కిన జనం, కోట్లలో ముంచేసిన జెర్రీ ఫౌండేషన్
హైదరాబాద్ ఓ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. నేరెడ్‌మెట్‌లో జెర్రీ ఫౌండేషన్ అనే పేరిట కొందరు వ్యక్తులు ఓ సంస్థ పెట్టి కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందుకోవచ్చని మాయమాటలు చెప్పి జనాలకు కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. హైదరాబాద్ ఓ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని నేరెడ్‌మెట్‌లో జెర్రీ ఫౌండేషన్ అనే పేరిట కొందరు వ్యక్తులు ఓ సంస్థ పెట్టారు. లక్ష పెట్టుబడికి రూ.3 లక్షలు లాభం ఇస్తామని చెప్పడంతో జనం వీరి మాటలను నమ్మి.. అప్పు చేసి మరి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. అనుకున్న విధంగా కోట్లు వసూలు కావడంతో నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న జెర్రీ ఫౌండేషన్ ప్రతినిధులు ఏసు, పవన్ , సంతోషీల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.