హైదరాబాద్‌: ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిక్కుల్లో పడ్డారు. జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో సన్నిహిత సంబం ధాలున్నాయనే ఆరోపణలను ఆయన ఎదుర్కుంటున్నారు. ఈ సంబంధాలపై ఆరా తీసేందు కు, ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయనే విషయాన్ని తెలుసుకునేందుకు హైదరాబాదు నగర టీడీపీ సీనియర్‌ నేత, తెలంగాణ టీడీపీ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు బీఎన్‌.రెడ్డిని ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారించారు. 

జయరాం హత్య కేసు దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు కార్యాలయంలో గంటన్నరపాటు బీఎన్‌ రెడ్డిని పోలీసులు విచారించారు. రాకేష్‌రెడ్డి ఎలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం,అతడిని రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు తీసుకెళ్లడానికి గల కారణాలేమిటి అనే మూడు అంశాలపై విచారణ చేశారు.

ఇరవై రోజుల కిందట బీఎన్‌ రెడ్డి తన స్నేహితుడు రాకేశ్‌రెడ్డిని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ రాంబాబుతో గంటపాటు మంతనాలు జరిపారు. రాంబాబు తనకు బాగా తెలుసునని ఏ పనై నా చేసిపెడతాడని బీఎన్‌ రెడ్డి రాకేష్ రెడ్డిని నమ్మించినట్లు తెలుస్తోంది. దాంతో రాకేశ్‌రెడ్డి తన కారులోనే రాయదుర్గం పీఎస్‌కు అతనితో వెళ్లాడు. 

జయరాం సెటిల్మెంట్‌లో తనకు సహకరించాలని రాకేశ్‌రెడ్డి సీఐ రాంబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలి విచారణలో రాంబాబు ఇదే విషయాన్ని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌.శ్రీనివాస్‌కు తెలియజేశారు. దీంతో బీఎన్‌ రెడ్డిని విచారణకు హాజరుకావాలని శుక్రవా రం రాత్రి ఫోన్‌ చేయగా ఆయన ఆదివారం విచారణకు వచ్చారు. 

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తాను ఖైరతాబాద్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడు రాకేశ్‌రెడ్డి పరిచయం అయ్యాడని, ఆయన కూడా టీడీపీ నేత కావడంతో పలుమార్లు మాట్లాడానని, అంతకుమించి తమ మధ్య ఏమీలేదని బీఎన్‌.రెడ్డి పోలీసులకు తెలిపారు.