విజయవాడ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.  ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్ గులాబీ దళపతి కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావుతోపాటు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను సైతం విడుదల చేశారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైందని లేఖలో పేర్కొన్నారు. 

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారని పవన్ అభిప్రాయపడ్డారు. 

ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉందన్నారు. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన హరీష్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గెలుపొందిన ప్రతీ ఒక్కరికి నా అభినందనలు అంటూ లేఖలో పవన్ పేర్కొన్నారు.