కేసీఆర్ ముఖ్యమంత్రి కాదని.. ఓ బ్లఫ్ మాస్టర్ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన సంగారెడ్డిలో పర్యటించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ... ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం ఊపిరిలూదుతోందన్నారు. తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో పార్లమెంట్ లో కేసీఆర్ లేనేలేరని జైరాం రమేష్ గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసింది అసలు దీక్షే కాదని, ఏసీ గదిలో కూర్చొని దీక్ష చేశారని మండిపడ్డారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చోవడం ఖాయమని అన్నారు. హైదరాబాద్ వండిపెట్టిన బిర్యానీలాంటిదని అభివర్ణించారు. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాత్రేమీ లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ కు హోదా అడగటం ద్రోహమన్నారు.

హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు, ఎన్టీఆర్, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ దేనని ఆయన అన్నారు. విభజన హామీలు నెరవేర్చమని ఇప్పటి వరకు కేసీఆర్.. మోదీని అడిగిందే లేదన్నారు.