తన ఉద్యోగి చేతిలోనే కోట్లు మోసపోయి... బైక్ షోరూం యజమాని సెల్పీ సూసైడ్ (వీడియో)
జగిత్యాల జిల్లాలో లక్కీ డ్రాం స్కీంలో కోట్లు మోసపోయిన ఓ బైక్ షోరూం యజమాని సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

జగిత్యాల : తనవద్దే పనిచేసే ఓ ఉద్యోగి చేతిలో మోసపోయానంటూ ఓ బైక్ షోరూం యజమాని ప్రాణాలు తీసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని ఓ హోటల్లో సెల్పీ వీడియో తీసుకుని షోరూం యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... మెట్ పల్లి పట్టణానికి చెందిన సబ్బాని నరేష్ కథలాపూర్ లో హీరో బైక్స్ షోరూం నిర్వహించేవాడు. ఈ షోరూంలో పనిచేసే ప్రతాప్ చాలా నమ్మకంగా వుండేవాడు. దీంతో షోరూం యజమాని అతడిని స్నేహితుడిలా చూసేవాడు. పనిలో చేరిన కొద్దిరోజులకే ప్రతాప్ తన పనితీరుతో యజమాని నరేష్ కు చాలా క్లోజ్ అయ్యాడు. ఎంతలా అంటే ప్రతాప్ చెప్పాడని వెనకాముందు ఆలోచించకుండా తనకు ఏమాత్రం అనుభవం లేని కొత్త బిజినెస్ లోకి దిగాడు నరేష్.
Read More ముఖానికి మాస్క్ పెట్టుకుని లక్షలు దోపిడీ... హైదరాబాద్ లో కిక్ సినిమా స్టైల్లో దొంగతనం
భవాని ఎంటర్ ప్రైజెస్ పేరుతో ప్రజలనుండి డబ్బులు వసూలు చేసి లక్కీ డ్రా ద్వారా బైక్స్ అందించే స్కీం నరేష్, ప్రతాప్ కలిసి ప్రారంభించారు. అయితే ప్రజలనుండి వసూలు చేసిన డబ్బులను ప్రతాప్ తనవద్దే పెట్టుకున్నాడని నరేష్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు లక్కీ డ్రా లో విజేతలుగా నిలిచినవారికి తన షోరూం నుండే 300వందలకు పైగా బైక్స్ ఇచ్చామన్నారు. ఇలా ప్రజల డబ్బుతో పాటు తనకు రావాల్సిన బైక్స్ డబ్బులు కూడా చెల్లించకుండా ప్రతాప్ మోసం చేసాడని నరేష్ ఆందోళన వ్యక్తం చేసాడు.
వీడియో
అయితే లక్కీ డ్రా స్కీం ద్వారా వసూలుచేసిన కోటీ తొంబై లక్షల రూపాయలు ప్రతాప్ తనవద్దే పెట్టుకుని ఆ నేరాన్ని తనపై మోపాడని నరేష్ సెల్పీ వీడియోలో తెలిపాడు. దీంతో తాను సమాజం ముందు మోసగాడిగా నిలబడాల్సి వచ్చిందని... చివరకు సొంతూరికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందంటూ నరేష్ ఆవేదన వ్యక్తం చేసాడు. తన చావు తర్వాత అయినా బాధితులను డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రతాప్ ను కోరాడు నరేష్.
నరేష్ సెల్పీ సూసైడ్ వీడియో కథలాపూర్ లోనే కాదు జగిత్యాల జిల్లామొత్తం కలకలం రేపింది. అతడి వీడియో ఆధారంగా హైదరాబాద్ లో ఎక్కడున్నాడో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నరేష్ భార్య రూపశ్రీ, సోదరుడు చంద్రశేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రజలను స్కీం పేరిట మోసగించి చివరకు నరేష్ ఆత్మహత్యకు కారణమైన ప్రతాప్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు.