జగిత్యాల జిల్లా మాయలేడి వలపు వల\' రహస్య ప్రదేశానికి తీసికెళ్లి...
జగిత్యాల జిల్లా మాయలేడి వలపు వలలో పలువురు చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వలపు వల విసిరి పలుపురిన యువతిని, ఆమె ముఠాను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు.
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల మాయలేడీ వలపు వలలో పలువురు ప్రముఖులు కూడా పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఓ మాయలేడి పలువురిని తన వలలో వేసుకుని రహస్య ప్రాంతాలకు తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత వారి నగలు, నగదు దోచుకోవడానికి ముఠా రంగంలోకి దిగుతుంది. ఈ ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
అందుకు సంబంధించిన వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూ శర్మ అందించారు. సింధూ శర్మ చెప్పిన వివరాల ప్రకారం... ముఠాకు చెందిన ఇద్దరు యువతులను, ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారంతా ఓ ముఠాగా ఏర్పడి పలుపురిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఠాలోని తులసి అనే యువతి యువకులతో పరిచయం పెంచుకుంటుంది. వారిని రహస్యమైన ప్రదేశాలకు తీసుకుని వెళ్తుంది.
ఆ ప్రదేశానికి రాజేష్, దినేష్ అనే ఇద్దరు యువకులు చేరుకుని వారిని బెదిరిస్తారు. తులసితో పాటు వచ్చినవారి ఒంటిపై ఉన్న నగలు, నగదు దోచుకుంటారు. ఇలా వారు కొన్ని నెలలుగా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరు కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు.
అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకున్నారు. ఈ ముగ్గురితో పాటు జమున అనే 40 ఏళ్ల మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జమున వారికి సహకరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
కోరుట్ల, మేడిపల్లి పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి 145 గ్రాముల బంగారాన్ని, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.