సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ను కాపాడుతూ సంగారెడ్డి ప్రజల సంక్షేమం కోసం తాను పాటుపడుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడ పార్టీని వీడబోరని ఆయన అభిప్రాయపడ్డారు.

శనివారం నాడు ఆయన సంగారెడ్డిలో మీడియాతో చిట్ చాట్ చేశారు.తాను సంగారెడ్డి ప్రజలకు తాను ఇచ్చిన హామీలు తనను గెలిపించాయని చెప్పారు.  మెదక్ ఎంపీ సీటును తన భార్యకు ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. 

కొందరికి కొన్ని బలహీనతలు ఉన్నాయని, వారి బలహీనతలను తెలుసుకొని వారికి అండగా నిలిస్తే వారంతా పార్టీలోనే ఉంటారని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను  ప్రజల్లోకి తీసుకెళ్లడంలో  తాము విఫలమైనట్టు చెప్పారు.  

సీఎల్పీ నేతగా తనకు అర్హతలున్నాయని చెప్పారు. ఈ విషయమై తాను కూడ సీఎల్పీ పదవిని కోరుతానని చెప్పారు. పార్టీ సీఎల్పీ నేత పదవిని ఇస్తే పనిచేస్తానని చెప్పారు. ఒకవేళ ఆ పదవి ఇవ్వకపోయినా కూడ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు.

సంగారెడ్డి నుండి తాను మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి తన కూతురు కారణమన్నారు. తన క్యాడర్ కూడ తన గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేసిందని ఆయన గుర్తు చేసుకొన్నారు.