కాంగ్రెస్ పార్టీపై పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ నేషనల్ ఐరన్ లెగ్ అని, రేవంత్ రెడ్డి స్టేట్ ఐరన్ లెగ్ అని అన్నారు. ఈ రెండు ఐరన్ లెగ్‌లు వరంగల్‌లో సొల్లు పురాణం చదివారని విమర్శలు గుప్పించారు. అది డిక్లరేషన్ కాదని, కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ అని పేర్కొన్నారు.
హైదరాబాద్: రాహుల్ గాంధీ నేషనల్ ఐరన్ లెగ్ అని, రేవంత్ రెడ్డి స్టేట్ ఐరన్ లెగ్ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్‌పీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ది రైతుల కోసం పోట్లాట కాదని, ఆ పార్టీ నేతల కొట్లాట సభ అని విమర్శించారు. అసలు వరంగల్ కాంగ్రెస్‌ది డిక్లరేషన్ కాదని, ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ అని అన్నారు. ఈ పార్టీ ఇండియన్ నేషనల్ క్లబ్, పబ్, గబ్బు పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని పేర్కొంటూ ‘రాహు’కల్ అని వ్యంగ్యం పలికారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అమేధిలోనే సమాధి అయిందని, ఇంట్లోనే చెల్లని రూపాయి పక్కింట్లో చెల్లుతుందా? అని విరుచుకుపడ్డారు.
రాచరికపు రాహుల్ గాంధీకి తెలంగాణ గురించి ఏం తెలుసు అని అడిగారు. రాహుల్ ఢిల్లీ నివాసి అని, రేవంత్ గల్లీ సన్నాసి అని విమర్శలు చేశారు. ఈ రెండు ఐరన్ లెగ్‌లు వరంగల్‌లో సొల్లు పురాణం వినిపించారని అన్నారు. గాంధీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, తరతరాలుగా తెలంగాణకు వారే విలన్లు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే పెండింగ్ ప్రాజెక్టులు అని, టీఆర్ఎస్ అంటే రన్నింగ్ ప్రాజెక్టులు అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలో కేసీఆర్ కట్టారని, నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయిందో చెప్పు అంటూ అడిగారు.
తెలంగాణను మంచి పర్యాటక రాష్ట్రంగా కేసీఆర్ అభివృద్ధి చేశారని, అందుకే మొన్న నడ్డా, నిన్న రాహుల్ గాంధీ, రేపు అమిత్ షా వస్తారని అన్నారు. ఇలా ఢిల్లీ నుంచి తమ రాష్ట్రానికి టూర్లు వస్తే సంతోషమేనని చెప్పారు. అన్నదాతలకు అండగా రైతు బంధు, టీఆర్ఎస్ ఉండగా కాంగ్రెస్ భరోసా ఎందుకు? అని ప్రశ్నించారు. ఇంద్రవెల్లిలో వంద మందిని కాల్చి చంపిన కాంగ్రెస్ ఇప్పుడు ఆదివాసీలకు ఏదో చేస్తుందంటే ఎవరు నమ్ముతారని అడిగారు.
పంటలకు మద్దతు ధరలు పెద్ద జోక్‌గా చెప్పారని, మద్దతు ధరలు దేశవ్యాప్త నిర్ణయమా? లేక రాష్ట్రానికో పాలసీ ఉంటుందా? అని అడిగారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వని పసుపు బోర్డు ఇప్పుడు నంగనాచి మాటలు చెప్పుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఫైల్‌పై తొలి సంతకం చేస్తానని ఇదే రాహుల్ ఇచ్చిన హామీని ఎవరైనా నమ్మారా? అని పేర్కొన్నారు. ఇది డిక్లరేషన్ కాదు.. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ అన్నారని, అసలు ఈ దేశంలో గ్యారంటీ, వారంటీ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమేనని జీవన్ రెడ్డి విమర్శించారు. ఎయిర్‌పోర్టులో దిగగానే రాహుల్ గాంధీ ఇక్కడి నేతలు ఏం మాట్లాడాలో సూచనలు ఇచ్చారని ఆరోపించారు. గల్లీ సన్నాసులు రాసిచ్చిన అబద్ధాల స్క్రిప్ట్ చదివిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మరో 30 ఏళ్లు టీటఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.
