తెలంగాణ ఎన్నికల్లో రసవత్తర పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని ఓడించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు, అక్రమాలు జరక్కుండా అరికట్టేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. 

ఈ క్రమంలో ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమీప బందువుకు చెందిన ఫామ్ హౌస్ లో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. కొడంగల్ సమీపంలో జగన్నాథరెడ్డి అనే వ్యక్తి ఫామ్ హౌస్ పై తెల్లవారుజామున 4 గంటలకు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.  స్థానిక పోలీసుల సాయంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టగా భారీగా దాచిన డబ్బుతో పాటు కొన్ని రశీదులు లభించినట్లు సమాచారం.  అయితే ఈ డబ్బులు ఎవరికి...వీటికి సంబంధించి లెక్కలపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఫామ్ హౌస్ లో నగదు బయటపడ్డ మాట వాస్తవమేనని ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.కానీ ఆ డబ్బు ఎవరిది...వాటికి సంబంధించి ఏమైనా  లెక్కలున్నాయా ... అన్న విషయాలపై ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారని రజత్ కుమార్ తెలిపారు. ఈ ఘటన కొడంగల్ తీవ్ర కలకలం రేపుతోంది.