త్రిదండి చినజీయర్‌ స్వామిపై (Chinna Jeeyar Swamy) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు (Sri Ramanuja Millennium celebrations) నిర్వహించిన తీరు కేసీఆర్, చినజీయర్‌ స్వామి మధ్య చిచ్చురేపినట్టుగా ప్రచారం జరుగుతుంది. 


త్రిదండి చినజీయర్‌ స్వామిపై (Chinna Jeeyar Swamy) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు (Sri Ramanuja Millennium celebrations) నిర్వహించిన తీరు కేసీఆర్, చినజీయర్‌ స్వామి మధ్య చిచ్చురేపినట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా వాటికి బలం చేకూర్చేలా ఉన్నాయి. శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరు లేకపోవడంతో వివాదం మొదలైందని చెబుతున్నారు. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల రెండో రోజు సీఎం కేసీఆర్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ చిన్న‌జీయ‌ర్ స్వామితో క‌లిసి రామానుజాచార్యుల విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌ను సీఎం ప‌రిశీలించారు. 

అంతకు కొద్ది రోజులు ముందు కూడా చినజీయర్ ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్.. రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏర్పాట్లు, జాగ్రత్తలు అధికారులు దిశానిర్దేశం చేశారు. యాగానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని, మిషన్‌ భగీరథ నీళ్లు అందించాలని, యాగం నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సీఎం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

కట్ చేస్తే.. శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరు లేదని సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయంకు అందింది. ఈ క్రమంలోనే కేసీఆర్.. విగ్రహావిష్కరణకు, మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. కేసీఆర్ మాత్రమే కాకుండా.. ఆయన కుటుంబ సభ్యులు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల వైపు వెళ్లలేదు. 

మరోవైపు శ్రీరామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీపై చినజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించడం కేసీఆర్‌కు మరింత ఆగ్రహం తెప్పించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల వైపు సీఎం కేసీఆర్ వెళ్లలేదు. సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి కోవింద్‌కు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన కేసీఆర్ ఆయనతో పాటు చినజీయర్ ఆశ్రయమానికి వెళ్లలేదు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. 

కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నాడనే విషయం తెలుసుకున్న చినజీయర్ స్వామి ఆయన కోపాన్ని చలార్చే ప్రయత్నాలు చేశారు. మరోవైపు కేసీఆర్ సన్నిహితుడిగా పేరున్న మై హోం రామేశ్వరరావు కూడా కేసీఆర్‌ను కూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ‘సువర్ణమూర్తి’ ఆవిష్కరణ శిలాఫలకంపై ఆయన పేరును కూడా పెట్టారు. దీంతో సీఎం కాస్త చల్లబడి ముగింపు ఉత్సవాలకు హాజరవుతారని భావించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. 

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ దంపతులు వస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ ఆ కార్యక్రమానికి సైతం దూరంగా ఉండటంతో... చినజీయర్‌ స్వామిపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం మరింతగా జోరందుకుంది. సీఎం హాజరు కాకపోవడం ద్వారా తాను ఎంత ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

ఇదిలా ఉంటే ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్‌ స్వామి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రుత్వికులను సన్మానించే కార్యక్రమం ఆలస్యమవుతున్నందున శాంతికల్యాణాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే అన్ని అనుకున్నట్టే జరిగినప్పటికీ శాంతి కల్యాణాన్ని కావాలనే వాయిదా వేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. సీఎం కేసీఆర్‌ కోసమే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారని.. ఎలాగైన 19వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి ఆయనను రప్పించాలని చినజీయర్, రామేశ్వరరాము ఆశతో ఉన్నట్టుగా సమాచారం. 

ఏది ఎమైనా చినజీయర్ స్వామి, కేసీఆర్‌ల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ కూడా చినజీయర్ సలహాలకు ప్రాధాన్యత ఇస్తారనే చెప్పాలి. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణం మొత్తం చినజీయర్ స్వామి కనుసన్నల్లోనే జరుగుతుందనేది అందిరిక తెలిసిందే. ఆలయ ఏర్పాట్లు ఎలా చేయాలన్నదానిపై చాలా సార్లు చినజీయర్‌తో కేసీఆర్ చర్చించారు. మార్చి 21 నుంచి మహా సుదర్శనయాగం, 28న యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణం.. కార్యక్రమాలకు ఆహ్వానాలు, ఏర్పాట్లు, సంబంధిత అంశాలపై చినజీయర్‌తో సీఎం చర్చించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మార్పు వచ్చినట్టుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ ఏ రకమైన వైఖరి తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. మరి తాజా పరిణామాలు భవిష్యతుల్లో ఏ రకమైన మలుపు తిరుగుతాయో వేచిచూడాలి.