Asianet News TeluguAsianet News Telugu

జల వనరుల శాఖ పునర్వవ్యవస్థీకరణ,పోస్టుల సంఖ్య పెంపు: కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతిభవన్ లో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు.

Irrigation department divided into 19 circles : kcr lns
Author
Hyderabad, First Published Dec 28, 2020, 7:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతిభవన్ లో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు.

Irrigation department divided into 19 circles : kcr lns

భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జల వనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరణ చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు.  

రాష్ట్రం మొత్తాన్ని 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలు ఉంటాయి. ఆరుగురు ఈఎన్సీలను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. 

Irrigation department divided into 19 circles : kcr lns

జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్ లో బాధ్యతలు అప్పగించారు. 

 ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలో ఈఎన్సీల సంఖ్య ఆరుకు చేరుకుంటుంది. సీఈ పోస్టులను 19 నుండి 22కు, ఎస్ఈల పోస్టులు 47 నుండి 57కు, ఈఈల పోస్టులు 206 నుండి 234కు, డీఈఈల పోస్టులు 678 నుంచి 892కు, ఏఈఈల పోస్టులను 2,436 నుండి 2,796కు పెంచారు.

 టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 129 నుండి 199కి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుండి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుండి 398కి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుండి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుండి 238కి, రికార్డు అసిస్టెంట్ల సంఖ్యను 134 నుండి 205కు పెంచారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. 

రాష్ట్రంలో అత్యంత ప్రాథాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షించారు.  ఛనాక-కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కెనాళ్లను 2021 జూన్ లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

 మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. 

ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఆదిలాబాద్ జిల్లాలో కుప్పి ప్రాజెక్టు, మహబూబ్ నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణం పూర్తి చేయాలని కోరారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని, దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. హుజూర్ నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 

 ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి , జోగు రామన్న, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖా నాయక్, ఆత్రం సక్కు, హన్మంత్ షిండే, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు సి.మురళీధర్, బి.నాగేంద్రరావు, హరిరామ్, సీఈ వి.రమేశ్,  సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, సలహాదారు కె.పెంటారెడ్డి,  డిప్యూటీ ఈఎన్సీ ఎం.అనిత, డీడీఏ కె.ఆర్.చందర్ రావు,  ఎస్ఈ ఎస్.భీమ్ ప్రసాద్, డీడీఎం సాజిద్, కె.ప్రసాద్ పాల్గొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios