నిరుపేదల అందించే రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా చూసేందుకు తెలంగాణ పౌరసరపరా శాఖ మరో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే రేషన్ కార్డు హోల్డర్ల ఫింగర్ ప్రింట్ ను ఉపయోగించి సరుకులను అందిస్తుండగా తాజాగా వారి కనుపాపలు(ఐరిష్) ఆధారంగా అందించనున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన రేషన్‌ షాపుల ద్వారా ఈ పద్దతిలోనే సరుకులు అందిస్తున్నట్లు...త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నట్లు పౌరసరఫరా శాఖ అధికారులు తెలిపారు. 

ప్రస్తుతం రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 5186 షాపుల్లో వేలిముద్రలతో పాటు ఐరిష్ పద్దతిని ఉపయోగించి సరుకులను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన కేవలం నాలుగు రోజుల్లోనే 15.20 లక్షల మందికి సరుకుల పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఐరిస్‌ పద్దతిలో సరుకుల పంపిణీ ఎలా జరుగుతుందో కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ పరిశీలించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు మరింత సులువుగా, మరింత ప్రయోజనం కలిగించేలా ఉండేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు అకున్ సబర్వాల్ తెలిపారు.

 

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ... త్వరలో అన్ని షాపుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా, అర్హులైన పేదలకు మరింత సులువుగా నిత్యావసర సరుకులు అందించడానికి ఐరిస్‌ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

గత ఏడాది నుంచి పౌరసరఫరాల శాఖ ఈపాస్‌ (బయోమెట్రిక్‌) విధానం ద్వారా సరుకుల పంపిణీ చేస్తోంది. అయితే ఈ విధానంలో కొంతమందిలో ముఖ్యంగా వృద్ధులు, మహిళల  వేలిముద్రలు అరిగిపోవడం వల్ల ఈపాస్‌ మెషీన్‌లు ధృవీకరించడం లేదు. దీంతో ప్రతినెల రేషన్‌ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లబ్ధిదారులు అసౌకర్యానికి గురికావద్దనే ఉద్దేశంతో వేలిముద్రలతో పాటు ఐరిస్ విధానాన్ని ఉపయోగించాలని పౌర సరఫరా శాఖ అధికారులు నిర్ణయించారు.