తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మార్కుల కేటాయింపుపై త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కమిటీ సిఫారసుల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామని ఆమె వెల్లడించారు. కరోనా పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు భవిష్యత్, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఈ నిర్ణం తీసుకున్నట్లు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పరీక్షలు రాయాలనుకునేవారు కోవిడ్ అదుపులోకి వచ్చిన తర్వాత రాయొచ్చని మంత్రి వెల్లడించారు. 

అయితే అంతకుముందు ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై  ఇంకా నిర్ణయం తీసుకోలేదని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటర్ సెకండియర్  పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ఇవాళ ఉదయం నుండి మీడియాలో వార్త కథనాలు ప్రసారమయ్యాయి. ఈ విషయమై ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం సాగింది. 

Also Read:ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దు:ట్విస్టిచ్చిన మంత్రి సబితా

ఇంటర్ సెకండియర్ పరీక్షలపై సమీక్ష నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకొంటామని ప్రకటించారు. మంగళవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయమై చర్చించారు. అయితే కేబినెట్ భేటీ తర్వాత ఇంటర్ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై సమీక్ష నిర్వహించిన తర్వాతే ప్రకటన చేస్తామని మంత్రి సబితా ప్రకటించారు.కరోనా కారణంగా టెన్త్ పరీక్షలను  రద్దు చేసింది ప్రభుత్వం. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది