మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మంత్రి శంకర్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 300 దొంగతనాలు చేసిన మంత్రి శంకర్ ను తాజాగా శుక్రవారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంత్రి శంకర్‌ అలియాస్‌ శివన్న గురించి ఆశ్చర్యకరమైన విషయాలను పోలీసులు వెల్లడించారు. గత 40 యేళ్లుగా దొంగతనాలు చేస్తున్న మంత్రి శంకర్ అన్ని పోలీసు విభాగాలకు తెలిసిన పేరు. ఇప్పటికే 256 నేరాల్లో 32 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇందులో నాలుగుసార్లు పీడీ యాక్ట్‌ ఉన్నాయి. ..ఇదీ మంత్రి శంకర్‌ అలియాస్‌ శివన్న ట్రాక్‌ రికార్డు. 

20 యేళ్లకే దొంగతనాలు మొదలుపెట్టిన మంత్రి శంకర్ 60యేళ్లు వచ్చినా మారలేదు. ఈసారి ఆరు నేరాల్లో నిందితుడిగా ఉన్న మంత్రి శంకర్‌తో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురినీ కూడా అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. 
సాధారణంగా బోయిన్‌పల్లి, బేగంపేట, మారేడ్‌పల్లి, కార్ఖానా, ఉస్మానియా వర్శిటీ ఠాణాల పరిధిల్లో ఒంటరిగానే చోరీలు చేసే మంత్రి శంకర్‌ వయసు మీదపడుతుండటంతో గత రెండేళ్లుగా ముఠాలను కట్టి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.

గతంలో ఓ కేసులో జైలుకెళ్లిన మంత్రి శంకర్‌ ఈనెల 4న జైలు నుంచి బయటకొచ్చాడు. అయితే ఈసారి ఫలక్‌నుమాకు చెందిన అబ్దుల్‌ లతీఫ్‌ ఖాన్, భవానీనగర్‌ వాసి మహ్మద్‌ మజీద్, నల్లకుంట వాసి మహ్మద్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌లతో కలసి మంత్రి శంకర్‌ ముఠాను ఏర్పాటు చేసుకుని నల్లకుంట, కుషాయిగూడ, వనస్థలిపురం ప్రాంతాల్లో తన చేతివాటం చూపించాడు. 

మూడొందల దొంగతనాలు చేసిన.. మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్ మంత్రి శంకర్‌ అరెస్ట్‌....

ఈనెల 11వ తేదీ రాత్రి బేగంపేటలో వరుసగా ఐదు ఇళ్ళ తాళాలు పగులకొట్టి ‘సోదా’చేయగా..రెండు ఇళ్ళల్లో మాత్రం బంగారం, నగదు లభించడంతో ఎత్తుకుపోయారు. బేగంపేటలో నమోదైన కేసుల దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు, ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్‌లు మంత్రి శంకర్‌ తోపాటు అతడికి సహకరించిన ముగ్గురినీ మహారాష్ట్రలో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12 లక్షల నగదుతో పాటు బంగారం, వాహనాలు, చోరీకి వాడే వస్తువులు స్వా«దీనం చేసుకున్నారు. 

అసలు ఎక్కడివాడీ మంత్రి శంకర్ అంటే.. సికింద్రాబాద్‌లోని చిలకలగూడకు చెందిన మంత్రి శంకర్‌  చిన్నతనంలో తన తల్లితో తరచూ గొడవపడుతుండేవాడు ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన శంకర్‌ 1979 డిసెంబర్లో తొలిసారిగా ఓ చోరీ చేసి దొంగగా మారాడు. ఈ కేసులో ఆ తర్వాత చోరీ సొత్తు ఖరీదు చేసే రిసీవర్‌గా మారాడు. 

ఈ నేరం కింద పోలీసులకు చిక్కడంతో రిమాండ్‌ నిమిత్తం అప్పటి ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైలుకు వెళ్ళాడు. అక్కడే శంకర్‌కు అప్పటి ఛత్రినాక పోలీసుస్టేషన్‌ పరిధికి చెందిన దొంగలు నాగిరెడ్డి, బల్వీందర్‌ సింగ్, దీపక్‌ సక్సేనా, నాగులు పరిచయం అయ్యారు. వారి వద్ద తాళం ఎలా పగులకొట్టాలో నేర్చుకున్నాడు. అక్కడే జైలులోని వంటగది తాళం పగులకొట్టించి చోరీ చేయిస్తూ వంట సామాను బయటకు తెప్పించి వండుకుని తినేవాళ్ళు.  

దొంగ అంటే మంత్రి శంకర్ ను తక్కువ అంచనా వేసేరు.. అతని ఆహార్యం చూస్తూ మీ ముందు నిలబెట్టి దొంగ ఇతనే అని చెప్పినా నమ్మరు. కారణం..దొరబాబులా ఖరీదైన వ్రస్తాలు, బూట్లు, టై ధరించి కార్లలో తిరుగుతూ రెక్కీలు చేసేవాడు. తాళం వేసి ఉన్న ఇల్లు రోడ్డు మీదికి కనిపిస్తే చాలు కాస్త దూరంలో వాహనాన్ని ఆపి దర్జాగా వెళ్ళి ‘పని’పూర్తి చేసుకుని వచ్చేవాడు. చిన్న రాడ్డు, స్క్రూ డ్రైవర్లను తనతో ఉంచుకునే శంకర్‌ ఎలాంటి తాళాన్నైనా కేవలం పది సెకన్లలో పగులకొట్టేవాడు. అర్ధరాత్రి దొంగతనం చేసి ఆ ఇంటి మిద్దె మీద తెల్లవారే వరకు కూర్చుని..మార్నింగ్‌ వాకర్స్‌ హడావుడి మొదలైనప్పుడు వారితో కలసిపోయేవాడు.  

ఇతడు పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వరుసగా మూడు రోజుల పాటు ఏ ఒక్క ప్రాంతంలోనూ ఉండకుండా మకాం మారుస్తూ ఉంటాడు. చోరీల ద్వారా వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే ఇతగాడికి వ్యభిచారం ప్రధాన బలహీనత. వ్రస్తాలు, బూట్లతో సహా ప్రతీదీ బ్రాండెడ్వే ఖరీదు చేసి వాడతాడు. ఇతగాడికి ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం మరో ముగ్గురు యువతులతో సహజీవనం చేస్తున్నాడు.