తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాలకు మొదటి రౌండ్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్, మహాకూటమిల మధ్య పోటీ టగ్ ఆఫ్ వార్ గా నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి ఫలితాలు. కాగా.. పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు.

మక్తల్ లో స్వతంత్ర అభ్యర్థి జలంధర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి చిట్టం రామ్మోహన్‌రెడ్డి బరిలో ఉండగా.. కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి కె. దయాకర్ రెడ్డి ఉన్నారు. ఈ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలుస్తారని లగడపాటి చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రామగుండంలోనూ స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.