మంత్రి, సీఎం కేసీఆర్ నియమించిన ఇంచార్జీలు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాజకీయాలు, వెకిలిచేష్టలు ఇకనైనా ఆపాలని ఆయన అన్నారు.

హైదరాబాద్: ఇష్టం లేకపోయినా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో తనకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారని, పిడికెడు మంది ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ప్రజాభిప్రాయాన్ని మారుస్తారని అనుకోవడం వెర్రిబాగులతనమని ఆయన అన్నారు. 20 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్నవారిని కోడి తన పిల్లలను రెక్కల కింద కాపాడుకున్నట్లు తాను కాపాడుకుంటున్నానని ఆయన చెప్పారు. 

ఇప్పుడు తల్లినీ పిల్లలనూ వేరుచేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రలోభాలకు గురి చేసి ఇబ్బంది పెడితే కొంత మంది తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుండవచ్చునని, వారి అంతరాత్మ మాత్రం తనతోనే ఉంటుందని ఆయన అన్నారు. అంతిమ విజయం న్యాయానిది, ధర్మానిదే తప్ప కుట్రలు ఎప్పుడు విజయం సాధించబోవని ఆయన అన్నారు. 

కరోనాతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది మరణిస్తున్నారని, సీఎం స్వయంగా సమీక్షించి ఏ జిల్లాలో మంత్రులు ఆ జిల్లాలో కోవిడ్ రోగులకు అందే సేవలను పర్యవేక్షించాలని చెప్పారని, కానీ కరీంనగర్ జిల్లాలో అందుకు బిన్నంగా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి గొర్రెల మంద మీద తోడేళ్ల మాదిరిగా హుజూరాబాద్ ప్రజాప్రతినిధులపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. 

తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన ఈ నియోజకవర్గంలోని సర్పంచులను, ఎంపీటీసిలను ఉద్యమంతో సంబంధం లేని మంత్రి, సీఎం నియమించిన కొందరు ఇంచార్జీలు ఫోన్ చేసి డబ్బులు ఆశ చూపుతూ అభివృద్ది పనుల బిల్లులు రావంటూ బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. 

తెలంగాణలో చైతన్యం నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారని, కరోనా రోగులకు మెరుగైనా చికిత్స అందించాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు. వెకిలిచేష్టలు, రాజకీయాలు ఇప్పుడు కాదని, ఇకనైనా ఆపాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆనయ అన్నారు. సమైక్య రాష్ట్రంలో సైతం ఇలాంటి ప్రయత్నం చేసి భంగపడ్డారని ఆయన అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.