హైదరాబాద్: టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు బాధ్యతలను అప్పగించడం  కేసీఆర్ వ్యూహత్మక ఎత్తుగడగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 
కేసీఆర్ తర్వాతే టీఆర్ఎస్‌లో కేటీఆర్ కీలకంగా మారారు. అదే సమయంలో హరీష్ రావు స్థానాన్ని  కూడ కేటీఆర్ బ్రేక్ చేశారు. భవిష్యత్తులో  తెలంగాణ రాష్ట్రానికి  కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా  బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడ లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో రెండో దఫా టీఆర్ఎస్  అధికారంలోకి వచ్చింది. ఈ నెల 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో  టీఆర్ఎస్  88 సీట్లను కైవసం చేసుకొంది.  మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడ టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచారు.

కేటీఆర్‌కు రానున్న రోజుల్లో  మరింత  కీలకమైన బాధ్యతలను అప్పగించేందుకు వీలుగానే  కేసీఆర్ వ్యూహత్మకంగా ఆయనను ప్రమోట్ చేస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

2006 పార్లమెంట్ ఎన్నికల సమయంలో  కేటీఆర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలో  ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో  కేటీఆర్ ఓ ఐటీ కంపెనీకి ఆసియా ఇంచార్జీగా ఉండేవారు. ఆ సమయంలో  కేటీఆర్ నెలకు కనీసంగా ఐదున్నర లక్షల వేతనం ఉండేది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో  కేటీఆర్ తొలిసారిగా సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుండి  పోటీచేసి విజయం సాధించారు. తొలిసారిగా ఆయన  అసెంబ్లీలో  అడుగుపెట్టారు.ఆ సమయంలో కెకె మహేందర్‌రెడ్డిపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటివరకు ఈ స్థానం నుండి  కేటీఆర్ నాలుగు దఫాలు విజయం సాధించారు.

కేటీఆర్  పార్టీలో చేరక ముందు  కేసీఆర్ తర్వాత హరీష్ రావు పార్టీ వ్యవహరాల్లో ఎక్కువగా పాల్గొనేవారు. కేసీఆర్ తర్వాతి స్థానం హరీష్ రావు గా చెప్పుకొనేవారు. కానీ, అనతికాలంలోనే కేటీఆర్ హరీష్ రావు స్థానాన్ని  భర్తీ చేశారు. మిలియన్ మార్చ్ సమయంలో  కేటీఆర్..  హరీష్ రావు   స్థానాన్ని బ్రేక్ చేశారు.2014 ఎన్నికల్లో  తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దీంతో  తెలంగాణ పార్టీ తరపున ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పార్టీ వాణిని విన్పించేవారు.

హైద్రాబాద్ నగరంలోని రోడ్ల దుస్థితిపై ట్విట్టర్ వేదికగా ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై కేటీఆర్ స్పందించేవారు. మారుమూల గ్రామానికి చెందిన  ఓ బాలుడికి శస్త్రచికిత్స కోసం  సహాయాన్ని సోషల్ మీడియా వేదికగా అర్థిస్తే వెంటనే ఆ బాలుడికి సహాయం అందించారు.

టీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌ కొడుకుగా ఉన్న తాను పార్టీలో  ప్రవేశించేందుకు మార్గం సులభంగా దక్కిందని కేటీఆర్ చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 99 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపించడంతో పాటు గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని 29 అసెంబ్లీ సీట్లలో 18 సీట్లలో టీఆర్ఎస్‌ గెలుచుకోవడంలో  తన పాత్రను ఎవరూ ఉందన్నారు. ఈ కారణంగానే తనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారని  ఆయన అభిప్రాయపడ్డారు.

2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  విపక్ష పార్టీలకు సవాల్ విసురుతూ 99 వార్దులను కైవసం చేసుకోవడంలో   కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత  కేటీఆర్‌కు మున్సిఫల్ మంత్రిత్వశాఖను కేసీఆర్ అప్పగించారు.

హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో  కేటీఆర్  తీవ్రంగా కృషి చేశారు. ఐటీ మంత్రిగా ఉంటూ రాష్ట్రానికి  ఐటీ పరిశ్రమలు ఎక్కువగా  రావడానికి ఆయన  శ్రమించారు. 

టీ-హబ్ , టీఎస్- ఐ పాస్  వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేయడంలో కేటీఆర్ ముందున్నారు. టీ-హబ్‌ను పలువురు ప్రముఖులు సందర్శించి ప్రశంసలతో ముంచెత్తారు.అమెరికాలో కేటీఆర్ పనిచేయడం కూడ ఐటీ పరిశ్రమలను తెలంగాణకు తీసుకురావడంలో కలిసి వచ్చిందని ఐటీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారంలో ఉంది.