సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేటలో అకస్మాత్తుగా కరోనా వైరస్ కేసులు పెరగడంలోని మిస్టరీ వీడింది. ఓ మహిళ ద్వారా 31 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. లాక్ డౌన్ సమయంలో ఓ మహిళ ఇంటింటికీ తిరుగుతూ ఆ ఇళ్లలో అష్టచెమ్మ ఆడింది. సమయం గడపడానికి ఆ మహిళ ఆ పనిచేసింది. ఆమె ద్వారా 31 మందికి కరోనా వైరస్ సోకింది.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి బృందం బుధవారం సూర్యాపేటలో పర్యటించిన విషయం తెలిసిందే. తబ్లిగి జమాత్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా ఓ మహిళకు కరోనా సోకింది. ఆ మహిళ లాక్ డౌన్ కాలంలో ఇళ్లు తిరుగుతూ వచ్చింది. 

ఆ మహిళ ద్వారా 31 మందికి కరోనా వైరస్ సోకింది. సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 83కు చేరుకుంది. బుధవారంనాడు మూడు కేసులు నమోదయ్యాయి. హైదరాబాదు తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేట జిల్లాలోనే నమోదయ్యాయి.

తొలి కేసు నమోదైన తర్వాత ఇంటింటి సర్వేను చేపట్టడంలో విఫలమైనందుకు ఐదుగురు జిల్లా స్థాయి అధికారులపై సస్పెన్షన్ కు గురయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నిరంజన్ ను తప్పించి ఆయన స్థానంలో బి సాంబశివ రావును నియమించారు. 

సూర్యాపేట డీఎస్పీ ఎం నాగేశ్వర రావు, సిఐ శివశంకర్ లను కూడా బదిలీ చేశారు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్లనే సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిందని భావిస్తున్నారు.