ఇక నుంచి హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయడానికి వీలులేదు. ఒకవేళ చేసారా.. జరిమానా చెల్లించక తప్పదు.  
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బహిరంగ మూత్ర విసర్జన నివారణ కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. అంతేకాకుండా స్వచ్ఛ కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలని నిర్ణయించారు. 

బహిరంగ మూత్ర విసర్జన నివారణకోసం ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. పెట్రోలు బంకులు, హోటళ్లలోని టాయిలెట్లను అందుబాటులోకి తేవడంతోపాటు బహిరంగ మూత్ర విసర్జన చేసే ప్రాంతాల్లో ముగ్గులు వేయడం, పెయింటింగ్ వేయడం, వలంటీర్లను నియమించడం తదితర కార్యక్రమాలు అమలుచేస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో గుర్తించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని నిశ్చయించారు.

నగరంలో 28ప్రాంతాల్లో ఎక్కువగా బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమేకాకుండా స్వచ్ఛ కార్యకర్తలను ఏర్పాటుచేసి మూత్ర విసర్జన జరగకుండా చూడాలని నిర్ణ‌యించారు. వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు. సీసీ కెమేరాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో యూరినల్స్‌ను ఏర్పాటుచేయాలని బల్దియా కమిషనర్ దానకిశోర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించేవారికి జరిమానా విధించాలని ఆయన స్పష్టంచేశారు.

నిబంధనల ప్రకారం బహిరంగ మూత్ర విసర్జనకు రూ. 100, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ. 100, డ్రైన్లలో చెత్త వేస్తే రూ. 1000, రోడ్లపై పెద్ద మొత్తంలో చెత్తవేస్తే రూ. 2000, చెత్తకుండీలో కాకుండా కుండీ పక్కకు చెత్తవేస్తే రూ. 100, నిర్మాణ వ్యర్థాలు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో వేస్తే రూ. 10000, నాలాల్లో చెత్తను, వ్యర్థాలను వేస్తే రూ. 10000 జరిమానా విధించే అవకాశముంది. స్వచ్ఛ సర్వేక్షణ్ నేపథ్యంలో ఈ మేరకు జరిమానాలను విధించాలని అధికారులు నిర్ణయించారు.