సంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. ఐఐటీ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. కందిలోని ఐఐటీ హైదరాబాద్ ఏ బ్లాక్‌లోని 319 నెంబర్ రూమ్‌లో ఉంటున్న మార్క్ ఆండ్రూ ఛార్లెస్ అనే విద్యార్ధి మాస్టర్ ఆఫ్ డిజైన్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన రూమ్‌ తలుపులు మూసుకున్న ఛార్లెస్ ఎంతకు బయటకు రాకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చింది. వెంటనే గది తలుపులు పగులగొట్టి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు.

దీంతో వారు విషయాన్ని ఐఐటీ యాజమాన్యానికి, పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఫైనల్ పరీక్షా రాశారని.. జూలై 5న ప్రజేంటేషన్ ఇవ్వాల్సి వుందని తోటి విద్యార్ధులు తెలిపారు.

సదరు సూసైడ్ నోట్‌లో. . తాను ఒక లూసర్‌నని.. ప్రతి దాంట్లో తక్కువ మార్కులు రావడంతో భవిష్యత్తులో ఉద్యోగం రాదని బెంగపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన చావుకు ఎవరూ బాధ్యులు కారని.. కొన్ని రోజులుగా మానసికంగా ఎంతో వేదన చెందానని.. మనసులో బాధ ఉన్నప్పటికీ అందరి ముందు బాగానే ఉండేవాడినని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

తనకు అర్హత లేదని.. తాను అర్హుడిని కాదని.. మీరు చేసిన విధంగానే తాను కూడా మీ అందరినీ తిరిగి ప్రేమిస్తున్నానని తెలుసుకోండని సూచించాడు. తన తల్లిదండ్రులు తన కోసం ఎన్నో త్యాగాలు చేశారని.. వారి ఆశలు నెరవేర్చలేకపోతున్నందుకు క్షమించాలని కోరాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఛార్లెస్ మరణంతో ఐఐటీ క్యాంపస్‌లో విషాద వాతావరణం నెలకొంది.