హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటే.. నగర బహిష్కరణే - సీఎం రేవంత్ రెడ్డి
ఎంజీబీఎస్ - ఫలక్ నూమ మెట్రో లైన్ పనులను అడ్డుకోవాలని ఎవరో కేంద్రానికి లేఖ రాశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వారిని హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటే నగర బహిష్కరణ తప్పదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన బైరామల్‌గూడ జంక్షన్‌లో నిర్మించిన లెవల్ -2 ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ఎంజీబీఎస్-ఫలక్ నూమ మెట్రోలైన్ పనులకు అసదుద్దీన్ ఒవైసీతో కలిసి తాను శుక్రవారం ప్రారంభించానని తెలిపారు. కానీ దానిని ఆపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కొన్ని వర్గాలు హైదరాబాద్ అభివృద్ధి అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిని హైదరాబాద్ లో నుంచి బహిష్కరిస్తామని సీఎం హెచ్చరించారు. ‘‘మెట్రో పనులకు శంకుస్థాపన చేసే సమయానికే కేంద్ర మాకు అనుమతి ఇచ్చింది. కానీ ఓ వ్యక్తి ఆ మెట్రో పనులను ఆపాలని కేంద్రాన్ని కోరారట. అందుకే వాటిని ఆపాలని కేంద్రం మాకె చెప్పింది. హైదరాబాద్ ను అభివృద్ధి చేయలేకపోయారు. చేసేవారికి కనీసం అడ్డంకులు సృష్టించొద్దు’’ అని అన్నారు.
హైదరాబాద్ అభివృద్దిని అడ్డుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అది మంచి పద్ధతి కాదని అన్నారు. అలా చేసే వారిని నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. జాగ్రత్తగా వ్యవహరించి హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాని సూచించారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత వ్యూహాలు రచిస్తోందన్నారు.
ఇందులో వైబ్రెంట్ తెలంగాణ మాస్టర్ ప్లాన్ 2050 తయారీ ఉందని, దాని కోసం ఇప్పటికే టెండర్లు చేసి, అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించ బోతున్నామని అన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ పూర్తయిన తర్వాత అన్ని రంగాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తామని అన్నారు. తాను ఎల్బీనగర్ ను సందర్శించినప్పుడల్లా తన గుండె చప్పుడు పెరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తనకు అనేక మంది బంధువులు, స్నేహితులు, మద్దతుదారులు ఉన్నారని తెలిపారు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశామని, దీని ద్వారా సమగ్ర పురోగతి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అన్ానరు. మూసి నది నుంచి వచ్చే కలుషిత నీటితో నల్లగొండలో సుమారు 50 వేల ఎకరాల పంట నష్టం వాటిల్లుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.