తెలంగాణ రాష్ట్రంలో నాలుగో విడత సీరో సర్వేను నిర్వహించింది జాతీయ పోషకాహార సంస్థ. దీని ప్రకారం 55 శాతం మంది పిల్లలు, 61 శాతం మంది పెద్దవారిలో యాంటీబాడీలు గుర్తించారు. అలాగే 82.4 శాతం మంది హెల్త్‌కేర్‌ వర్కర్లలో యాంటీబాడీలు గుర్తించామని తెలిపింది.

తెలంగాణలో నాలుగో విడత సీరో సర్వే ఫలితాలను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ప్రకటించింది. రాష్ట్రంలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఐసీఎంఆర్‌ సీరో సర్వే నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. సీరో సర్వేలో భాగంగా 60 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు గుర్తించినట్లు వెల్లడించింది. వీరిలో 55 శాతం మంది పిల్లలు, 61 శాతం మంది పెద్దవారిలో యాంటీబాడీలు గుర్తించామని పేర్కొంది. అలాగే 82.4 శాతం మంది హెల్త్‌కేర్‌ వర్కర్లలో యాంటీబాడీలు గుర్తించామని తెలిపింది.

తొలి విడతలో 0.33 శాతం, రెండో విడతలో 12.5 శాతం, మూడో విడతలో 24.1 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు ఎన్‌ఐఎన్‌ వెల్లడించింది. జాతీయ స్థాయిలో గత ఏడాది 24 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలను గుర్తించగా.. ప్రస్తుతం అది 67 శాతానికి చేరింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో 94 శాతం సీరో పాజిటివిటీ రేట్ ఉన్నట్లు ప్రకటించింది.

తద్వారా కరోనా వ్యాక్సిన్‌లు సమర్ధంగా పనిచేస్తున్నాయనే విషయం స్పష్టమవుతోందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. జూన్‌ నెలలో నిర్వహించిన సర్వేను అన్ని వయసుల వారిపై చేపట్టగా.. ఈ సారి 6-9 ఏళ్ల వయసున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. దాదాపు 55 శాతం పిల్లల్లో (6 నుంచి 9ఏళ్ల) సీరో పాజిటివ్‌గా తేలగా.. యువతలో 61 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ముందుగానే వ్యాక్సిన్లు అందించడం వల్ల వారిలో కొవిడ్‌ యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు నిపుణులు అంచనా 
వేస్తున్నారు.