తెలంగాణలో ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో రాచకొండ పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. అధికార పార్టీకి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని, ప్రచారం కూడా చేస్తున్నారంటూ విమర్శలు మొదలయ్యాయి.

అసలు మ్యాటర్ లోకి వెళితే...రాచకొండ పోలీసు కమిషనరేట్ కి చెందిన ఓ వాహనానికి టీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టి ఉన్నాయి. అది మీడియా కంట పడటంతో.. ఫోటో వైరల్ గా మారింది. టీఆర్ఎస్ కి పోలీసులు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.

కాగా.. ఈ ఘటనపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వివరణ ఇచ్చారు. పోలీసు వాహనాలు పెట్రోలింగ్ కి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు వాహనానికి ఆ జెండాను కట్టారని ఆయన తెలిపారు. వెంటనే ఆ జెండాను తొలగించినట్లు కూడా ఆయన తెలిపారు. కాగా.. పోలీసు వాహనానికి జెండా కట్టింది ఎవరో, ఆ ఫోటోని సోషల్ మీడియాలో ఎవరు షేర్ చేశారో.. తదితర విషయాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.

నిందితులను పట్టుకొని.. పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన వివరించారు. దయచేసి.. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆపాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రజలను వేడుకున్నారు.