తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆరుగురు సభ్యుల రాంజీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎస్‌వోటీ, ఈపీఎస్‌ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించి రాంజీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం వనస్థలిపురం పనామా కూడలి వద్ద యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బంది నగదు పెట్టెలను వాహనం నుంచి కిందకు దించుతున్నారు.

ఈ సమయంలో రాంజీ ముఠాలోని ఓ సభ్యుడు కింద డబ్బులు పడ్డాయని సెక్యూరిటీ గార్డుకు మాయమాటలు చెప్పి రూ. 70 లక్షలున్న నగదు పెట్టెను ఎత్తుకెళ్లాడు. ఈ చోరీ అప్పట్లో సంచలనం కలిగించింది.

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి.. ఇది రాంజీ ముఠా పనిగా నిర్ధారించారు. అప్పటి నుంచి నిందితులను పట్టుకోవడానికి అనేక చోట్ల గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు ముఠా జాడ కనిపెట్టారు.