హైదరాబాద్:హైద్రాబాద్ చర్లపల్లి జైలు వద్ద పోలీసు ఉన్నతాధికారులు 144 సెక్షన్ విధించారు.  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు  బెయిల్ మంజూరు చేసింది. దీంతో చర్లపల్లి జైలు వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున  ముందుజాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. 

 అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా  ఉపయోగించిన కేసులో  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఈ నెల 5వ తేదీన నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో రేవంత్ రెడ్డికి  హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ సాయంత్రానికి రేవంత్ రెడ్డి చర్లపల్లి  జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. చర్లపల్లి జైలువద్దకు కాంగ్రెస్ పార్టీకి చెందిన క్యాడర్ భారీగా వచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా  చర్లపల్లి జైలు వద్ద 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేశారు.