ఆన్‌లైన్ లోన్‌ యాప్‌ల కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దాడులు చేపట్టారు. బెంగళూరులో రెండు కాల్ సెంటర్లపై దాడులు చేశారు.

ఈ కాల్ సెంటర్లలో 350 మంది టెలీకాలర్లు పని చేస్తున్నారు. 42 లోన్ యాప్‌లను నాలుగు సంస్థలు నడిపిస్తున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 27 కేసులు నమోదయ్యాయి. 350 అకౌంట్ల నుంచి డబ్బు జమ అవుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు.

మొత్తం 87 కోట్లను ఫ్రీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు. లిఫంగ్, పిన్ ప్రింట్, లబోలో, హాట్‌ఫుల్ టెక్నాలజీ‌లతో పాటు మరో 42 యాప్‌‌లపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రజలెవరూ ఆన్‌లైన్‌ లోన్‌లు తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు అరెస్ట్ చేసిన వారిని హైదరాబాద్‌లో కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ ఫ్రాడ్ వెనకాల వున్న వాస్తవాలను పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ లోన్‌లు ఎవరూ తీసుకోవద్దంటూ, హైదరాబాద్ పోలీసులు కోరారు.

ఇవన్నీ కూడా చైనాకు చెందిన యాప్‌లేనని పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైనాకు చెందిన జియాంగా యాంగ్ అనే వ్యక్తితో కలిసి ఉమాపతి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆన్‌లైన్ లోన్ యాప్ కంపెనీలు సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై ఆర్‌బీఐ అధికారులతో కూడా చర్చిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.  సైబరాబాద్‌లో 8 కేసులు రిజిస్టర్ అయినట్లు పేర్కొన్నారు.