పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం కృష్ణారెడ్డి వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా హత్యకు పాల్పడిన హంతకులు వాడిన వాహానాన్ని గుర్తించేందుకు పోలీస్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా కోగంటి సత్యం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాల్‌డేటాతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.

అటు బెజవాడ పోలీసులు సైతం రాంప్రసాద్ హత్యలో కోగంటి పాత్రపై ఆరా తీస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య తలెత్తిన ఆర్ధిక, వ్యాపార వివాదాలపై దృష్టిసారించారు. ఈ క్రమంలో 2013లో రాంప్రసాద్‌  పై కోగంటి అనుచరులు దాడి చేసి... అతనిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

అంతేకాకుండా బలవంతంగా చెక్కులు, ప్రామీసరి నోట్లపై కోగంటి సంతకాలు చేయించాడని అప్పట్లో రాంప్రసాద్ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోగంటి-రాంప్రసాద్ వివాదంలో రాజకీయ నేతల పాత్రపై పోలీసులు దృష్టి సారించారు.