తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి ప్రధాన కారణమైన గ్లోబరీనా సంస్థకి ఇంటర్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంటర్ బోర్డు నుంచి గ్లోబరీనాను తొలగించింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. కాగా...దీని కారణంగా 28మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో.. ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

త్వరలో జరగబోయే ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలను నిర్వహించే బాధ్యత నుంచి గ్లోబరీనాను తప్పించింది. దీనికి సంబంధించి సప్లిమెంటరీ ఫలితాల నిర్వహణకుగాను కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇందులో భాగంగానే సంస్థ ఎంపిక బాధ్యతను తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్ (టీఎస్ టీఎస్)కు అప్పగించింది. ఈ మేరకు టీఎస్ టీఎస్ కూడా టెండర్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో గ్లోబరీనా సంస్థకు ఉద్వాసన పలికినట్లు స్పష్టమవుతుంది.

2018-19 నుంచి మూడేళ్ల పాటు పరీక్ష ఫలితాల నిర్వహణ బాధ్యతలను ఇంటర్‌ బోర్డు గ్లోబరీనాకు అప్పగించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.4.80 కోట్లతో ఈ టెండర్‌ బాధ్యతలను అప్పగించింది. అయితే మొదటి ఏడాదే పరీక్ష నిర్వహణలో గ్లోబరీనా పూర్తిగా విఫలమైంది. 

అనేక సాంకేతిక తప్పిదాలు జరిగినట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఈ తప్పులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు, విద్యార్థి సంఘాలు ముప్పేట దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుని గ్లోబరీనాపై వేటు వేసింది.