అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేళ ... ముస్లిం యువతకు అసదుద్దీన్ సంచలన పిలుపు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముస్లింల ప్రార్థనా మందిరాలపై కుట్రలు చేస్తోంది ... కాబట్టి యువత అప్రమత్తంగా వుండాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల(జనవరి 22న) ప్రదాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి సంచలన వ్యాఖ్యలు చేసారు. గత 500 సంవత్సరాలుగా ఖురాన్ పఠనం జరిగిన పవిత్ర మసీదు మనది కాకుండా పోయిందంటూ బాబ్రీ మసీదు కూల్చివేత, రామమందిర నిర్మాణం గుర్తించి ప్రస్తావించారు. బాబ్రీ మసీదు స్థానంలో రామమందిరం నిర్మాణం బిజెపి కుట్ర అనేలా అసద్ వ్యాఖ్యానించారు. ఇలాగే మరికొన్ని మసీదుల విషయంలో కుట్రలు జరుగుతున్నాయనేలా హైదరాబాద్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేసారు.
ముస్లిం యువత ఇప్పటికైనా అప్రమత్తం కావాలని... అల్లా నిలయమైన మసీదులను కాపాడే బాధ్యత తీసుకోవాలని హైదరాబాద్ ఎంపీ సూచించారు. మసీదుల్లో ముస్లిం యువత నిత్యం వుండేలా చూడాలని ఆయన సూచించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని... ముఖ్యంగా మసీదులను లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. కాబట్టి మన మసీదులను మనమే కాపాడుకోవాలని... అందుకోసం యువత ముందుకు రావాలని అసదుద్దీన్ సూచించారు.
Also Read మసీదు బానిసత్వానికి చిహ్నం.. దానిని కూల్చే రామ మందిర నిర్మాణం - కర్ణాటక బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేస్తే, మరెంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చామని ముస్లీం సమాజం గుర్తుంచుకోవాలని అసదుద్దీన్ సూచించారు. ఇప్పుడు మన మతమే ప్రమాదంలో వుంది... కాబట్టి ముస్లిం ప్రజలంతా ఒక్కటి కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఐకమత్యంతో వుంటేనే మన మనుగడ సాగుతుంది అనేలా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కామెంట్స్ చేసారు.
అసదుద్దీన్ వ్యాఖ్యలపై బిజెపి ఐటి సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ ఇలా కులమతాల మధ్య విబేధాలు సృష్టించే వ్యాఖ్యలు తగవన్నారు. తెలంగాణ రాజధాని హైదారాబాద్ లో నూతన సచివాలయ నిర్మాణం కోసం రెండు మసీదులు ధ్వంసం చేసారని మాలవీయ గుర్తుచేసారు. హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న ఓవైసి అప్పుడు ఎందుకు నోరు తెరవలేదని అమిత్ మాలవీయ నిలదీసారు.