హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 12 కరోనా వైరస్ కంటైన్మెంట్లను ఏర్పాటు చేశారు. ఈ కంటైన్మెంట్లలో జీవితం ఎలాగుంటుందనేది ఆసక్తికరమైన విషయమే. కంటైన్మెంట్ల నుంచి బయటకు రావడానికి గానీ లోపలికి వెళ్లడానికి గానీ వీలుండదు. ఆ ప్రాంతానికి వెళ్లే దారులను ఏడెనిమిది అడుగుల ఎత్తు గల బారికేడ్లతో మూసేశారు. ఇది కోవిడ్ కంటైన్మెంట్ జోన్. నో ఎంట్రీ అనే బ్యానర్ ఎర్రటి అక్షకరాలతో కనిపిస్తుంది. 

ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావడానికి వీలు లేదు. పాలు, ఇతర నిత్యావసర సరుకులను అందించే ఏర్పాట్లు ఉంటాయి. ఈ నిత్యావసరాలు రావడానికి మాత్రమే చిన్న దారి ఉంటుంది. మిగతా అంతా పకడ్బందీగా మూసేసి ఉంటుంది. పైగా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఆ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లకే పరిమితమై కిటికీల్లోంచి అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటారు. నిత్యావసరాలు తీసుకోవడానికి ఓ ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు వస్తారు. 

అటువంటి కంటైన్మెంట్లలో ఏసీ గార్డ్స్ కాలనీ ఒకటి. ఏసీ గార్డ్స్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మరో ముగ్గురికి కరోనా లక్షణాలను ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఏసీ గార్డ్స్ కాలనీని కరోనా కంటైన్మెంట్ గా ప్రకటించారు  

మల్లేపల్లి బడే మసీదు అంటువంటి ప్రాంతాల్లో ఒక్కటి. ఇక్కడ జమాత్ తబ్లిగీ కార్యాలయం ఉంది. ఆ ప్రాంతానికి అన్ని వైపులా దారులు మూసేశారు. ఢిల్లీ జమాత్ కు వెళ్లి వచ్చిన ఇండోనేషియన్లు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ మూడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వాళ్లు ఎక్కువ మందిని కలిసి ఉంటారనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేశారు. దాదాపు 80 మందిని క్వారంటైన్ చేశారు 

హైదరాబాదులోని చింతల్ బస్తీ కరోనా కంటైన్మెంట్లలో మరోటి. ఈ ప్రాంతంలో ఆరుగురు కరోనా పాజిటివ్ రోగులు ఉన్నట్లు తేలింది. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య శాఖ అధికారులు సర్వే చేశారు. ఈ ప్రాంతాన్ని మొత్తం అధికారులు సీల్ చేశారు. హైదరాబాదులో అత్యధికంగా 162 కరోనా పాజిటివ్ ఉన్నట్లు బయటపడింది. 

విదేశాల నుంచి మాత్రమే కరోనా లక్షణాలతో వస్తున్నారని భావించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. అయితే, ఢిల్లీలోని జమాత్ కు వెళ్లి వచ్చినవారు ప్రాణాంతకంగా పరిణమించినట్లు తేలడంతో ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది.