హుజూర్ నగర్: హుజూర్ నగర్ శాసనసభ స్థానం ఉప ఎన్నికలో సిపిఎం అభ్యర్థి పారేపల్లి శేఖర రావు నామినేషన్ తిరస్కరణ వెనక జరిగిందేమిటనేది చర్చనీయాంశంగా మారింది. సరైన పత్రాలు సమర్పించలేదని రిటర్నింగ్ అధికారి తెలియజేసినా అభ్యర్థి పారేపల్లి శేఖర రావు గానీ, పార్టీ జిల్లా కార్యదర్శి రాములు గానీ ఎందుకు స్పందించలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. 

రిటర్నింగ్ అధికారి సమాచారం ఇచ్చినప్పటికీ వాటిని సమర్పించి నామినేషన్ ను అంగీకరింపజేసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపైనే రాష్ట్ర నాయకత్వంపై శేఖర రావుపై, రాములుపై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

పారేపల్లి శేఖర రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, రాములును జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు. తమ పార్టీ అభ్యర్థి రంగంలో లేని పరిస్థితిలో సిపిఎం తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఏదైనా పార్టీకి మద్దతుగానే కావాలని పారేపల్లి శేఖర రావు తన నామినేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించారా అనేది తెలియదు. ఈ విషయంలో రాష్ట్ర పార్టీకి సమాచారం ఉండడం వల్లనే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరో వామపక్ష పార్టీ సిపిఐ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతు ఇస్తోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా టీఆర్ఎస్ కే మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. కాంగ్రెసు తరఫున తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు.